AP Municipal Election Results 2026: కౌంట్‌డౌన్ స్టార్ట్..మరికొన్ని గంటల్లో తేలనున్న అభ్యర్థుల జాతకాలు!
AP Municipal Election Results 2026: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎస్‌ఈసీ సర్వం సిద్ధం చేసింది.
AP Municipal Election Results 2026: కౌంట్‌డౌన్ స్టార్ట్..మరికొన్ని గంటల్లో తేలనున్న అభ్యర్థుల జాతకాలు!
AP Corporation Election Results: ఆంధ్రప్రదేశ్ పురపోరు ఫలితాల వేళ ఆయా పార్టీలలో ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. రీపోలింగ్ సైతం ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పూర్తి దృష్టి సారించారు. ఫలితాలు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉండటంతో అటు అధికార కూటమి, ఇటు విపక్షం తమ నేతలను, ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాయి.
ఓట్ల లెక్కింపు పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసేందుకు ఎన్నికల కమిషన్ బృహత్తర ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 138 కౌంటింగ్ కేంద్రాలు, వాటిలో 556 కౌంటింగ్ హాళ్లను సిద్ధం చేశారు. మొత్తం 6,831 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. లెక్కింపు ప్రక్రియలో మొత్తం 47,817 మంది సిబ్బంది భాగస్వాములు కానున్నారు. వీరిలో 6,831 మంది సూపర్‌వైజర్లు, 13,662 మంది కౌంటింగ్ సిబ్బంది, 27,324 మంది అసిస్టెంట్లు ఉంటారు.స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్ల వద్ద మూడంచెల భద్రతతో పాటు సీసీ కెమెరాల నిరంతర నిఘా ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలోని 92 పురపాలికలు, కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల రేస్ హోరాహోరీగా సాగింది. 13 కార్పొరేషన్లలోని 922 డివిజన్లలో 118 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 3,020 వార్డులకు గానూ 637 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 2,382 వార్డులకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ స్థానాల కోసం మొత్తం 10,262 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా రీపోలింగ్ పూర్తయిన 13 కేంద్రాలతో కలిపి మొత్తం 62.16 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎస్‌ఈసీ వెల్లడించింది. మొత్తం 96,89,061 మంది ఓటర్లకు గాను 60,22,411 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెద్ద నగరాల కంటే చిన్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనే ఓటర్లు ఎక్కువ సంఖ్యలో తరలివచ్చి ఓట్లు వేయడం విశేషం. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా, మధ్యాహ్నానికల్లా పురపాలక పీఠాలు ఎవరికి దక్కుతాయనేది స్పష్టం కానుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.




