Weather Update: వర్షాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు కూల్ న్యూస్.. 3 రోజుల పాటు దంచికొట్టనున్న వానలు
Weather Update: వర్షాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా రైతాంగానికి వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది.
Weather Update
Weather Update: వర్షాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా రైతాంగానికి వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తమిళనాడు తీర ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో బలమైన ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీనికితోడు దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఈ రెండింటి సంయుక్త ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడి, రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
ఉత్తర కోస్తా, యానాంలో ఈదురుగాలుల బీభత్సం
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశముంది. వర్షంతో పాటు ఆది, సోమవారాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలో ఈదురుగాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలే ప్రమాదం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దక్షిణ కోస్తాలోనూ వర్ష సూచన
రాబోయే మూడు రోజులు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇక్కడ కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచనలు జారీ చేశారు.
రాయలసీమలోనూ పడనున్న జల్లులు
రాయలసీమ జిల్లాలలో కూడా రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం చల్లబడి, అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షం కురిసే సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున, పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు వర్షం పడే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు కోరారు. రాబోయే మూడు రోజులు కురిసే ఈ వర్షాలు ఎండల నుంచి ఉపశమనాన్ని ఇవ్వడమే కాకుండా, సాగు నీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఎంతో మేలు చేయనున్నాయి. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం.




