Weather Update : బంగాళాఖాతంలో ద్రోణి కలకలం.. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజులు వానలే వానలు
Weather Update : బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో పలు జిల్లాల్లో వడగాలుల తీవ్రత కూడా ఉండనుంది.
Weather Update
Weather Update : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం చాలా విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనాలు ఒకవైపు భానుడి భగభగలకు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, మరోవైపు అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ కీలక వివరాలు వెల్లడించారు. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో బలమైన ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, అదే సమయంలో కొన్ని జిల్లాల్లో వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు.
సముద్ర మట్టంలో చోటుచేసుకున్న అనూహ్య మార్పులే ఈ అకాల వర్షాలకు ప్రధాన కారణమని వాతావరణ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర మీదుగా తెలంగాణ వరకు ఒక బలమైన అల్పపీడన ద్రోణి విస్తరించి ఉంది. ఈ ద్రోణి కదలికల వల్ల తేమతో కూడిన గాలులు భూభాగం వైపు వస్తుండటంతో వాతావరణం అకస్మాత్తుగా చల్లబడి వర్షాలు కురిసేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది.
ఈ ద్రోణి ప్రభావం కారణంగా గురువారం నాడు మార్కాపురం ప్రాంతంతో పాటు రాయలసీమ జిల్లాల్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటితో పాటు అల్లూరి సీతారామరాజు, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
ఈదురుగాలులు, ఆకస్మిక వర్షాల సమయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది. ముఖ్యంగా పొలాల్లో పనులు చేసుకునే రైతులు, గొర్రెలు, మేకలు కాసే పశుకాపరులు ఉరుముల శబ్దాలు వినబడగానే బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద పెద్ద చెట్ల కింద, కరెంట్ స్తంభాల పక్కన, భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ కింద నిలబడకూడదు. బలమైన గాలుల వల్ల కరెంట్ తీగలు తెగిపడే ప్రమాదం ఉన్నందున రోడ్లపై వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
ఒకవైపు వర్షాల హెచ్చరికలు ఉంటే, మరోవైపు ఎండ తీవ్రత కూడా జనాలను భయపెడుతోంది. జూన్ 11వ తేదీన రాష్ట్రంలోని మొత్తం 13 మండలాల్లో తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని అధికారులు అలర్ట్ చేశారు. విజయనగరం జిల్లాలోని బొండపల్లి, గజపతినగరం, గంట్యాడ, మెంటాడ మండలాల్లో.. పార్వతీపురం మన్యం జిల్లాలోని మక్కువ, పాటిపెంట, పార్వతీపురం, సాలూరు ప్రాంతాల్లో.. కాకినాడ జిల్లాలోని కాకినాడ అర్బన్, రూరల్, పిఠాపురం, అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలాల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మరో 42 మండలాల్లో సాధారణ వడగాలులు వీస్తాయి.
రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు కావచ్చు. అలాగే పోలవరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 40 నుంచి 41 డిగ్రీల వరకు ఎండలు మండిపోనున్నాయి.
బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో అత్యధికంగా 44.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 44.2, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 43.9, బాపట్ల జిల్లా ఇంకొల్లు, పోలవరం జిల్లా కూనవరంలో 43.8 డిగ్రీలు నమోదయ్యాయి. కాకినాడ జిల్లా పిఠాపురం, విశాఖ జిల్లా గాజువాక, విజయనగరం జిల్లా రాజాంలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.




