AP MPTC, ZPTC Election Results: ఏపీ ఎన్నికల్లో ఆల్ టైమ్ రికార్డ్ మెజార్టీ: ఏకంగా 30 వేల ఓట్లతో జనసేన సంచలన విజయం..
AP MPTC, ZPTC Election Results: ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాల్లో రికార్డు మెజార్టీలు. క్రోసూరులో జనసేన అభ్యర్థికి 30 వేల పైచిలుకు మెజార్టీ, మాచవరం, మైలవరంలో కూటమి హవా.
AP MPTC, ZPTC Election Results: ఏపీ ఎన్నికల్లో ఆల్ టైమ్ రికార్డ్ మెజార్టీ: ఏకంగా 30 వేల ఓట్లతో జనసేన సంచలన విజయం..
AP MPTC, ZPTC Election Results: ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠ భరితంగా సాగుతున్న పరిషత్ (జడ్పీటీసీ, ఎంపీటీసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థులు వినూత్న రికార్డులు సృష్టిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వెలువడుతున్న ఫలితాల్లో పలువురు అభ్యర్థులు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ ఊహకందని భారీ మెజార్టీలతో ఘన విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ముఖ్యంగా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు జడ్పీటీసీ స్థానం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పమిడిపాటి శ్రీనివాసరావు ఏకంగా 30,273 ఓట్ల భారీ మెజార్టీతో సత్తాచాటారు. క్రోసూరు మండలంలో మొత్తం 38 వేల ఓట్లు మాత్రమే పోలవ్వగా, ప్రత్యర్థిపై ఆయన సాధించిన ఈ రికార్డు స్థాయి మెజార్టీ రాష్ట్రంలోనే అత్యధికంగా నిలవడం విశేషం. ఈ భారీ విజయంతో జనసేన శ్రేణులు క్రాకర్లు కాల్చి సంబరాల్లో మునిగిపోయాయి.
ఇదే ఊపులో ఇతర జిల్లాల్లోనూ కూటమి అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై జైత్రయాత్ర కొనసాగించారు. మాచవరం మండలంలో కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కత్తి సరోజిని సమీప వైసీపీ అభ్యర్థి దొండేటి వెంకాయమ్మపై ఏకంగా 22,882 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించి పసుపు జెండా పాపారు.
అలాగే ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి పుత్త బ్రహ్మం 21,407 ఓట్ల భారీ మెజార్టీతో తన సత్తా చాటుకున్నారు. మరోవైపు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండల టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి చేరెడ్డి శ్రీలక్ష్మి 12,616 ఓట్ల మెజార్టీతో ఘన విజయం అందుకుని సభలో ప్రాధాన్యత చాటుకున్నారు.
ఇక కడప జిల్లా వేంపల్లిలో వైఎస్‌ఆర్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి బత్తల వెంకట శివమ్మ 19,203 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తమ పట్టును నిలుపుకున్నారు. మొత్తంగా పల్లె పోరులో కూటమి అభ్యర్థులు సాధిస్తున్న ఈ భారీ మెజార్టీలు రాష్ట్ర రాజకీయాల్లో నూతన సమీకరణాలకు అద్దం పడుతున్నాయి. ప్రత్యర్థులను కోలుకోలేని దెబ్బతీస్తూ అధికార ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు జోరుగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు.




