ZPTC MPTC Election Counting: ఓట్ల లెక్కింపులో ఊహించని ట్విస్ట్.. బ్యాలెట్ బాక్సులో ఓట్లతో పాటు గ్రామస్థుల కరపత్రాలు!
ZPTC MPTC Election Counting: ఏపీ పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌లో ట్విస్ట్. నరసరావుపేట బ్యాలెట్ బాక్స్‌లో రైల్వే వంతెన కరపత్రాలు ప్రత్యక్షం, సీఎం చంద్రబాబు, పవన్‌లకు వినతి.
ZPTC MPTC Election Counting: ఓట్ల లెక్కింపులో ఊహించని ట్విస్ట్.. బ్యాలెట్ బాక్సులో ఓట్లతో పాటు గ్రామస్థుల కరపత్రాలు!
ZPTC MPTC Election Counting: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి గురువారం పోలింగ్ నిర్వహించగా, కట్టుదిట్టమైన పోలీసు భద్రత నడుమ అధికారులు లెక్కింపు చేపట్టారు. అయితే జిల్లాల్లోని పలు కౌంటింగ్ కేంద్రాల వద్ద అనూహ్య, ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని నరసరావుపేట ఏఎం రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సులను తెరిచిన అధికారులకు ఒక వినూత్న ఘటన ఎదురైంది. సత్తెనపల్లి మండలం కంకాణలపల్లి గ్రామానికి చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ సిబ్బంది అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో తెరిచి ఓట్లను వేరుచేస్తుండగా, బ్యాలెట్ పత్రాలతో పాటు కొన్ని కరపత్రాలు ప్రత్యక్షమయ్యాయి.
తమ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలోని రైల్వే గేటు వద్ద నిర్మాణం తలపెట్టిన యూ (U) ఆకారపు అండర్ పాస్ రైల్వే బ్రిడ్జి వల్ల భవిష్యత్తులో స్థానికులు పడే రాకపోకల ఇబ్బందులను వివరిస్తూ గ్రామస్థులు ఆ పత్రాల్లో రాసుకొచ్చారు. యూ-షేప్ బ్రిడ్జి స్థానంలో ప్రధాన రహదారికి నేరుగా అనుసంధానం అయ్యేలా వంతెనను పక్కాగా నిర్మించాలని కోరారు.
తమ ఊరి దీర్ఘకాలిక సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎన్నికల బ్యాలెట్ బాక్సులను ఇలా నిరసన వేదికగా మార్చుకున్నారు. ఈ రహదారి నిర్మాణంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ మరియు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించి సరైన రవాణా సదుపాయం కల్పించాలని గ్రామస్థులు ఆ లేఖల ద్వారా వేడుకున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో బయటపడిన ఈ కరపత్రాల వ్యవహారం ప్రస్తుతం పల్నాడు జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది.




