APSRTC: ఏపీ ప్రయాణికులకు సూపర్ న్యూస్.. త్వరలోనే కొత్త బస్సులు

APSRTC: ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు తీపి కబురు అందించింది. డిసెంబర్ నుంచి విడతల వారీగా 3,000 ఎలక్ట్రిక్, సీఎన్‌జీ కొత్త బస్సులు రోడ్డెక్కనున్నాయి.

CR Reddy
Published on: 15 Oct 2026 10:22 AM IST
APSRTC
X

APSRTC 

APSRTC: ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. ప్రయాణికుల రద్దీని తట్టుకోవడంతో పాటు ఆధునిక సౌకర్యాలు అందించేందుకు గాను ఏకంగా 3,000 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో పర్యావరణహిత ఎలక్ట్రిక్, సీఎన్‌జీ బస్సులను ప్రాధాన్యత క్రమంలో ప్రవేశపెట్టనున్నారు. డిసెంబర్ నాటికి మొదటి విడత బస్సులు రోడ్డెక్కనున్నట్లు ఆర్టీసీ సీఎండి శివప్రసాద్ వెల్లడించారు.

పీఎం ఈ-బస్ సేవా కింద 750 ఎలక్ట్రిక్ వాహనాలు

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం ఈ-బస్ సేవా పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించారు. ఈ బస్సులు ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి వివిధ డిపోలకు చేరుకుని ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు వచ్చే ఏడాది మే నాటికి మరో 500 సీఎన్‌జీ బస్సులను ప్రవేశపెట్టాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యే దశకు చేరుకుందని, తయారీ సంస్థల నుంచి విడతల వారీగా బస్సులు సంస్థకు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.

2027 నాటికి పూర్తిస్థాయిలో కొలువుదీరనున్న బస్సులు

ప్రస్తుతం ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ కొత్త బస్సుల రాకతో రద్దీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. 2027 చివరి నాటికి మొత్తం 3,000 బస్సులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. వచ్చే ఏడాది జులై నాటికి దాదాపు 1,450 బస్సులు దశలవారీగా సర్వీసులోకి రానున్నాయి. దీనివల్ల దూరప్రాంత ప్రయాణాలు చేసే వారికి, నిత్యం ప్రయాణించే ఉద్యోగులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ.30 లక్షల బీమా

ఆర్టీసీ ప్రయాణికులతో పాటు సంస్థలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి కూడా యాజమాన్యం తీపి కబురు అందించింది. సంస్థలో సేవలు అందిస్తున్న దాదాపు 8,500 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా శాలరీ అకౌంట్లతో పాటు రూ.30 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నారు. ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని ఏపీఎస్ఆర్టీసీ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది.

పండుగలకు ప్రత్యేక బస్సులు

దసరా, దీపావళి పండుగల సీజన్ సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 5,000కు పైగా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు సంస్థ ప్రకటించింది. అదే సమయంలో విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందిపై ఎవరైనా దాడులకు పాల్పడితే సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించింది. సిబ్బంది భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని, దాడి చేసిన వ్యక్తులపై చట్టప్రకారం కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.