ISRO: ప్రైవేట్ అంతరిక్ష రంగంలో 'విక్రమ్-1' ఒక చరిత్రాత్మక మైలురాయి!
ISRO: భారతీయ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ సుభాన్షు శుక్లా సూళ్ళూరుపేటలోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రాన్ని (SHAR) సందర్శించారు.
ISRO: ప్రైవేట్ అంతరిక్ష రంగంలో 'విక్రమ్-1' ఒక చరిత్రాత్మక మైలురాయి!
ISRO: భారత అంతరిక్ష పరిశోధన రంగంలో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరిస్తూ చేపట్టిన 'విక్రమ్-1' ఆర్బిటల్ రాకెట్ ప్రయోగం నేపథ్యంలో, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు 'ఆక్సియం' యాత్రలో వెళ్ళిన భారతీయ వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ సుభాన్షు శుక్లా ఇవ్వాళ తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SHAR)ను సందర్శించారు.
ఈ సందర్భంగా షార్‌లోని బి.పి. హాల్ (BP Hall)లో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు మరియు స్థానిక పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగింది. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి 'విక్రమ్-1' ప్రయోగం ఒక చరిత్రాత్మక మైలురాయి అని పేర్కొన్న సుభాన్షు శుక్లా, ఈ ప్రయోగం దేశ అంతరిక్ష సామర్థ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతుందని, రాకెట్ ప్రయోగం వెనుక ఉన్న శాస్త్రవేత్తల కృషిని, సాంకేతికతను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
తన 'ఆక్సియం' అంతరిక్ష యాత్రకు సంబంధించిన అనుభవాలను పంచుకుంటూ, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన రోజులు, అక్కడ శూన్య స్థితిలో పరిశోధనలు చేయడం, వ్యోమగాముల దైనందిన జీవనశైలి మరియు భూమిని అంతరిక్షం నుంచి చూసినప్పుడు కలిగిన అనుభూతిని ఆయన వివరించారు. తన ప్రయాణం కేవలం ఒక వ్యక్తిగత విజయం మాత్రమే కాదని, ఇది దేశం సాధిస్తున్న సాంకేతిక పురోగతికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, పట్టుదల మరియు శాస్త్రీయ దృక్పథం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఇస్రో ఉన్నతాధికారులు మరియు షార్ ఉద్యోగులు పాల్గొని వ్యోమగామిని ఘనంగా సత్కరించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సుభాన్షు శుక్లా సహనంతో సమాధానాలిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు.




