ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వకుంటే రాష్ట్రవ్యాప్త పోరాటాలు తప్పవు: జాడి శ్వేత హెచ్చరిక!
చట్టసభలలో మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం నేత జాడి శ్వేత డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జాతీయ స్థాయిలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
చట్టసభలలో మహిళలకు ఉమ్మడిగా కేటాయిస్తున్న 33 శాతం రిజర్వేషన్లలో, ఓబీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించకుంటే జాతీయ- రాష్ట్ర స్థాయిలలో సమరశీల పోరాటాలే శరణ్యమంటూ,ఆంధ్ర ప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాడి శ్వేత ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అనాదిగా అన్ని రంగాలలో-అన్ని విధాల వెనుకకు నెటబడ్డ ఓబిసి మహిళలకు మహిళా రిజర్వేషన్లలో సబ్ కోటా లేకపోతే ప్రస్తుత మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేల రక్తసంబంధీకులతోనే చట్టసభలు నిండిపోతాయన్నారు. మహిళల్లో సగానికి పైగా ఉన్న ఓబీసీ మహిళలకు సామాజిక న్యాయమందించకుండా నారీ శక్తి బలంగా ఐక్యం కాలేదని,దానితో వికసిత్ భారత్ సాధ్యపడదన్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు "చట్టసభలలో మహిళా రిజర్వేషన్ల" అంశాన్ని చర్చించేందుకు ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు మీడియా ద్వారా ప్రకటించడం సంతోషదాయకమన్నారు . ఆ సమావేశాలలో బీసీ మహిళలకు సబ్ కోటా నిచ్చేలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో పార్లమెంటు చే రాజ్యాంగ సవరణ చేయించి, మహిళా రిజర్వేషన్ చట్టాన్ని 2029 నుండే అమలు చేసేలా చర్యలు గైకొని చరిత్ర పుటలలో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆశిస్తున్నామన్నారు. రాష్ట్ర ఓబీసీల ఓట్లతో సీట్లు గెలిచి, గద్దె నెక్కే పాలక-ప్రతిపక్ష ఎంపీలు ఓ బి సి మహిళలకు సబ్ కోటా ఇవ్వకుండా దగా చేసి,పార్లమెంటులో అడుగుపెట్టనీయకపోవడం ఉమ్మడి కుట్రగా ఓబీసీలు భావిస్తున్నారన్నారు. ఓబీసీలే మా పార్టీలకు వెన్నెముకలంటూ, తమది ఒబీసీల పార్టీ అంటే,కాదు తమదేనంటూ పోటీపడే నేటి రాజకీయ వ్యవస్థలోని అన్ని పార్టీలు ఓబీసీలకు సామాజిక అన్యాయం చేస్తూనే ఉన్నారన్నారు. అందుకే ఓబిసి మహిళలు తమ వాణిని బలంగా వినిపించేందుకు రాష్ట్రవ్యాప్త సమరశీల పోరాటాలకు శ్రీకారం చుట్టేందుకు నడుం బిగించాలని జాడి శ్వేత పిలుపునిచ్చారు.




