AP Govt: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి కాదు
AP Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఎంతో ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది.
AP Govt
AP Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఎంతో ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు, సబ్సిడీలు పొందాలంటే ఇప్పటివరకు తప్పనిసరిగా ఉన్న ఆధార్ నిబంధనపై క్లారిటీ ఇస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ లేదనే ఏకైక కారణంతో ప్రజలకు ఎటువంటి ప్రభుత్వ సేవలను నిరాకరించకూడదని తేల్చిచెప్పింది.
ఆధార్ ఆప్షనల్ మాత్రమే
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు మీ సేవా కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వం ఈ మేరకు ప్రత్యేక ఆదేశాలు పంపింది. ప్రభుత్వ సేవలకు ఆధార్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఎవరైనా స్వచ్ఛందంగా ఇస్తేనే ఆధార్ తీసుకోవాలని, ఒకవేళ ఇవ్వకపోతే ఇతర ప్రత్యామ్నాయ గుర్తింపు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి సేవలు అందించాలని సూచించింది.
246 రకాల సేవలకు వర్తింపు
ప్రభుత్వం మొత్తం 246 రకాల సేవలను దీనికోసం ప్రత్యేకంగా గుర్తించింది. ఆధార్ లేదనే కారణంతో ఈ సేవలను ఆపడానికి వీలే లేదని స్పష్టం చేసింది. ఒకవేళ ఆధార్ అందుబాటులో లేకపోతే, దరఖాస్తుదారులకు ఏయే ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలు వాడవచ్చో సిబ్బంది వివరించాలని ఆదేశించింది. అంతేకాదు, దివ్యాంగుల సర్టిఫికెట్ల జారీలోనూ ఇదే విధానం ఖచ్చితంగా అమలవుతుందని పేర్కొంది. ఆధార్ ధ్రువీకరణ విఫలమైనా సరే, ప్రజలకు నిరభ్యంతరంగా సేవలు అందించాల్సిందేనని తేల్చిచెప్పింది.
ఈ కేవైసీపై కఠిన మార్గదర్శకాలు
ఒకవేళ పౌరులు స్వచ్ఛందంగా ఆధార్‌ను ఇస్తే, దానిని సేకరించే సమయంలో ఎందుకు తీసుకుంటున్నామనే కారణాన్ని స్పష్టంగా తెలియజేయాలి. అంతేకాకుండా, ఆ వివరాలను ఎలా ఉపయోగిస్తారు, వాటి భద్రత ఎలా ఉంటుంది అనే అంశాలపై పూర్తి స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. యూఐడీఏఐ నిబంధనల ప్రకారం ఎన్‌క్రిప్టెడ్ ఆధార్ డేటా వాల్ట్‌లో ఆ సమాచారాన్ని భద్రపరచాలని స్పష్టం చేసింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ప్రభుత్వ సేవలకు ఆధార్ లేదనే సాకుతో ఎవరైనా సేవలు నిరాకరిస్తే మాత్రం ఉపేక్షించేది లేదని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తే సంబంధిత సిబ్బందిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రజలు ఎవరూ ఆధార్ తప్పనిసరి అని భయపడాల్సిన అవసరం లేదని, సులభంగా ప్రభుత్వ సేవలను పొందవచ్చని భరోసా కల్పించింది.




