CM Ramesh: జగన్‌కు సీఎం రమేశ్ బహిరంగ సవాల్.. నిజం తేలితే రాజకీయం వదిలేస్తా!
CM Ramesh: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
CM Ramesh: జగన్‌కు సీఎం రమేశ్ బహిరంగ సవాల్.. నిజం తేలితే రాజకీయం వదిలేస్తా!
CM Ramesh: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ కుటుంబ హత్యా రాజకీయాలు, వివేకానందరెడ్డి మృతి మరియు వైఎస్ రాజారెడ్డి చరిత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో జగన్‌కు సంబంధం ఉందో లేదో తేల్చడానికి 'ఓపెన్ పోల్' (బహిరంగ ఓటింగ్) పెట్టాలని సీఎం రమేశ్ సవాల్ విసిరారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యను జగన్ తన రాజకీయ లబ్ధి కోసం వేరేలా చిత్రీకరిస్తున్నారని సీఎం రమేశ్ మండిపడ్డారు."వివేకా హత్య కేసులో జగన్ హస్తం ఉందా..? లేదా..? అనేదానిపై బహిరంగంగా ఓపెన్ పోల్ పెట్టాలి. ఈ కేసుతో జగన్‌కి ఎలాంటి సంబంధం లేదని ప్రజల నుంచి తేలితే.. నేను ఇప్పుడే రాజకీయాలు వదిలేస్తా, దీనికి జగన్ సిద్ధమా?" అని సవాల్ విసిరారు. జగన్ హత్యా రాజకీయాల గురించి ప్రజలందరికీ తెలిసిపోయిందని, అందుకే ఇప్పుడు తానేదో మంచివాడినని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కేసులో సీబీఐ విచారణ జరిపి ఇప్పటికే వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి చరిత్రపై సీఎం రమేశ్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పోలీసు రికార్డుల్లో రాజారెడ్డిపై రౌడీషీట్ ఉందనే విషయాన్ని ప్రస్తావించారు. ఓ కులాన్ని అడ్డుపెట్టుకుని, దొంగతనాలు చేయించి భారీగా డబ్బు గడించిన చరిత్ర రాజారెడ్డిదని ఆరోపించారు. పులివెందులలో ఒక మైన్ ఓనర్‌ను అంతమొందించి, ఆ గనులను దక్కించుకుని రాజారెడ్డి ధనవంతుడయ్యారని విమర్శించారు. పులివెందుల పరిధిలోని పార్నపల్లి గ్రామంలో రాజారెడ్డి చేసిన అరాచకాలకు, ఆకృత్యాలకు నేటికీ సజీవ సాక్షులు ఉన్నారని చెప్పుకొచ్చారు.
రాజారెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎందరినో హతమార్చారని.. చివరకు ఆయన వల్ల ఇబ్బంది పడిన బాధితులే ఆయన్ను హత్య చేశారని సీఎం రమేశ్ పేర్కొన్నారు. రాజారెడ్డిపై రౌడీషీట్, కేసులు నమోదైన సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు సీఎం కాదని, కనీసం టీడీపీ ప్రభుత్వమే అధికారంలో లేదని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ మరణంపై జగన్ అనవసర వ్యాఖ్యలు చేస్తూ సెల్ఫ్ గోల్ వేసుకున్నారని సీఎం రమేశ్ కౌంటర్ ఇచ్చారు.




