Botsa Anusha: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో హీట్.. విజయనగరం జడ్పీ పీఠం బరిలోకి బొత్స అనూష?
Botsa Anusha: విజయనగరం జిల్లా పరిషత్ పీఠం రేసులో వైఎస్సార్సీపీ తరఫున డాక్టర్ బొత్స అనూష బరిలోకి దిగుతున్నారన్న ప్రచారం. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో జోరుగా వ్యూహాలు.
Botsa Anusha: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో విజయనగరం జిల్లా పరిషత్ (ZP) పీఠం పోరు అత్యంత రసవత్తరంగా మారుతోంది. జెడ్పీ చైర్మన్ స్థానం బీసీ మహిళకు రిజర్వు కానుందన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి ఆయన కుమార్తె, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ బొత్స అనూష ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే వార్త రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇప్పటికే జిల్లా రాజకీయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండి, క్షేత్రస్థాయిలో కేడర్తో బలమైన సంబంధాలు ఉన్న డాక్టర్ బొత్స అనూషను జెడ్పీ చైర్మన్ బరిలో నిలపాలని వైసీపీ శ్రేణులు తీవ్రంగా పట్టుబడుతున్నాయి.
పార్టీ మారిన కీలక నేత చిన్న శ్రీను కుటుంబం లేదా కూటమి శిబిరం నుంచి ఆయన కుమార్తె సిరిని బరిలో నిలిపినా, అనూష రూపంలో బలమైన అభ్యర్థితో దీటుగా బదులివ్వాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఉత్తరాంధ్రలో తమ పార్టీ పట్టును మరింత నిలబెట్టుకోవడానికి ఈ ఎన్నికలను వైఎస్సార్సీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఈ ఎన్నికల్లో బీసీ మహిళా రిజర్వేషన్ అంశమే ప్రధాన అస్త్రంగా మారనుండటంతో, సరైన అభ్యర్థిని రంగంలోకి దించి జిల్లాలో తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని రెండు ప్రధాన శిబిరాలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.




