Chandrababu: సింగపూర్‌లో ‘సీబీఎన్@361 డిగ్రీస్’ పుస్తకం లాంచ్.. చంద్రబాబుకు అంతర్జాతీయ అవార్డు!

Chandrababu: సింగపూర్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు "సీబీఎన్@361 డిగ్రీస్.. పాలీమ్యాథ్" పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Arun Chilukuri
Published on: 16 Jun 2026 12:40 PM IST
Chandrababu
X

Chandrababu: సింగపూర్‌లో ‘సీబీఎన్@361 డిగ్రీస్’ పుస్తకం లాంచ్.. చంద్రబాబుకు అంతర్జాతీయ అవార్డు!

Chandrababu: సింగపూర్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దార్శనికతకు అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో “సీబీఎన్@361 డిగ్రీస్.. పాలీమ్యాథ్” (CBN@361 Degrees.. Polymath) పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. సింగపూర్ ప్రభుత్వ గుర్తింపు పొందిన కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కృతమైన ఈ పుస్తకం తొలి ప్రతులను సింగపూర్‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, ఏపీ మంత్రి పి.నారాయణ మరియు కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులకు అందించారు. ‘రేపటి కోసం’ దినపత్రిక చీఫ్ ఎడిటర్ శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ ఈ పుస్తకాన్ని రచించగా.. విశ్రాంత ఐఏఎస్ అధికారి కేవీ సత్యనారాయణ దీనిని ఆంగ్లంలోకి అనువదించారు.

ఒక దార్శనిక నేతగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో, వివిధ క్లిష్ట సమయాల్లో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల విశ్లేషణే ఈ పుస్తకం. ప్రపంచంలోనే అత్యుత్తమ పాలకులుగా గుర్తింపు పొందిన సింగపూర్ నిర్మాత లీ క్వాన్ యూ, న్యూజిల్యాండ్ మాజీ ప్రధాని జేసిందా ఆర్నాడ్ తరహాలోనే చంద్రబాబు నిర్ణయాలు ఉంటాయని రచయిత ఇందులో పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ల రూపకల్పన, అమరావతి రాజధాని నిర్మాణంలో ఆయన చూపిస్తున్న శ్రద్ధే దీనికి నిదర్శనమన్నారు. ఏపీ రెరా మాజీ చైర్మన్ రామనాథ్ వివిధ సందర్భాల్లో వ్యక్తపరిచిన అభిప్రాయాల్లో.. బాహ్య ప్రపంచానికి తెలియని అనేక ఆసక్తికర అంశాలను ఈ పుస్తకంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ముఖ్యమంత్రి చంద్రబాబును "గ్లోబల్ పాలీమ్యాథ్ అవార్డు" (Global Polymath Award) తో ఘనంగా సత్కరించింది. అంతేకాకుండా, సింగపూర్ రూపకర్త లీ క్వాన్ యూ శతజయంతిని పురస్కరించుకుని విడుదల చేసిన ప్రత్యేక వెండి నాణేన్ని అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి బహూకరించారు. త్వరలోనే ఈ పుస్తకాన్ని తెలుగు, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ అంతర్జాతీయ వేడుకలో రెరా మాజీ చైర్మన్ రామనాథ్, కేవీ సత్యనారాయణ, శంకర ప్రసాద్‌తో పాటు సింగపూర్‌లోని పలువురు తెలుగు ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story