Kothapeta: రావులపాలెంలో మీడియాతో మాట్లాడిన కొత్తపేట ఎమ్మెల్యే!
Kothapeta: రైతు సంక్షేమం, అభివృద్ధిపై చంద్రబాబు దూరదృష్టితో ఆలోచిస్తారని, వైసీపీ నేతలది వక్రబుద్ధని మండిపడ్డ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.
Kothapeta: రావులపాలెంలో మీడియాతో మాట్లాడిన కొత్తపేట ఎమ్మెల్యే!
Kothapeta: పాలనలో చంద్రబాబు దూరదృష్టం ఆలోచిస్తారని, జగన్ మోహన్ రెడ్డి వక్రబుద్ధితో ప్రతిదీ రాజకీయం చేస్తారని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో సాగునీటి ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో వైసీపీ నాయకులు ప్రతి సమస్యను చంద్రబాబు నాయుడుకు ఆపాదించడం సరికాదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.
రావులపాలెం క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ముందుచూపుతో చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తపట్నం, వెలిగొండ వంటి సాగునీటి ప్రాజెక్టులు నేడు రైతులకు, ప్రజలకు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు.
రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
కూటమి ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే బండారు తెలిపారు. కరువు పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి, అవసరమైన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. రాష్ట్రంలో కరువు ప్రభావిత మండలాల గుర్తింపు, రైతులకు భరోసా కల్పించడం, సాగు–తాగునీటి సమస్యలను ఎదుర్కొనేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
యూరియా కొరతపై స్పష్టత ఇవ్వాలి
రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే బండారు స్పందిస్తూ.. రైతులు అవసరానికి అనుగుణంగా ఎరువులు వినియోగించేలా ప్రభుత్వం సూచనలు చేస్తోందని తెలిపారు. ఎక్కడైనా సరఫరా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
కాలువల నిర్వహణపై ప్రత్యేక దృష్టి
గతంలో కాలువల నిర్వహణపై నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించిన ఎమ్మెల్యే బండారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో నియోజవర్గంలో ఉచ్చిలి, వసంతవాడ, పేరవరం లిఫ్ట్ ఇరిగేషన్ లు, కాలువల పరిస్థితిపై పరిశీలనలు నిర్వహించి, అవసరమైన చోట మరమ్మతులు చేపడుతోందన్నారు. అమలాపురం పరిధిలో కాలువల సమస్యలపై అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని తెలిపారు.
పట్టాదారు పాస్‌బుక్స్, భూ రికార్డుల సవరణ
భూ రికార్డుల్లో గతంలో ఏర్పడిన సమస్యలను పరిష్కరించేందుకు రీసర్వే, రెవెన్యూ రికార్డుల సవరణపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే బండారు అన్నారు. QR కోడ్, రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌బుక్స్‌ను అందించడం జరుగుతోందని తెలిపారు. భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో వేగం
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం త్వరితగతిన చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గతంలో రైతులు చెల్లింపుల కోసం ఎదురుచూసిన పరిస్థితులు ఉండేవని ఆరోపించిన ఆయన.. ప్రస్తుతం రైతులకు సమయానుకూలంగా చెల్లింపులు అందేలా వ్యవస్థను బలోపేతం చేశామని పేర్కొన్నారు.
నిత్యావసర ధరల నియంత్రణకు చర్యలు
ఎల్‌నినో ప్రభావం, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా కొన్ని నిత్యావసర వస్తువుల ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఎమ్మెల్యే బండారు అన్నారు. బియ్యం, ఉల్లిపాయలు తదితర వస్తువులను అందుబాటు ధరల్లో ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.
ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని ఎమ్మెల్యే బండారు తెలిపారు. ఈ విషయంపై అధికారులతో మాట్లాడి, ఎక్కడైనా ఎంఆర్పీకి మించి విక్రయాలు జరిగితే చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు.
ఇసుక విషయంలో పారదర్శక విధానం
ఇసుక సరఫరాలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండే విధానాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్యే బండారు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుకకు అధిక ధరలు చెల్లించాల్సిన పరిస్థితులు ఉండేవని ఆరోపించిన ఆయన.. ప్రస్తుతం రవాణా, జీఎస్టీ తదితర చట్టబద్ధమైన ఖర్చులు మినహా ప్రజలకు అందుబాటులో ఇసుక లభించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
వాడపల్లి దేవస్థానం అభివృద్ధిపై దృష్టి
వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యాల కల్పనకు, అభివృద్ధి పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే బండారు చెప్పారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల విషయంలో మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం
కోటపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో రోడ్లు, సాగునీరు, రవాణా, దేవస్థానాలు తదితర రంగాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే బండారు పేర్కొన్నారు. బొద్దం లిఫ్ట్ ఇరిగేషన్, రావులపాలెం–వాడపల్లి రహదారి, సర్వీస్ రోడ్లు వంటి పలు అభివృద్ధి పనులపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.
రాజకీయ విమర్శలకంటే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి
ప్రభుత్వంపై విమర్శలు చేయడం కంటే ప్రజలకు ఉపయోగపడే సూచనలు, సలహాలు ఇవ్వాలని ఎమ్మెల్యే బండారు వైసీపీ నాయకులకు సూచించారు. రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.
గత పాలనపై ప్రజలకు అవగాహన ఉంది
గత ఐదేళ్ల పాలనలో జరిగిన పరిణామాలను ప్రజలు గమనించారని ఎమ్మెల్యే బండారు అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను గత పాలనతో ప్రజలు పోల్చి చూస్తున్నారని పేర్కొన్నారు.
శాంతిభద్రతల విషయంలో పోలీసుల చర్యలు
గంజాయి, అక్రమ కార్యకలాపాలు, చట్టవిరుద్ధ చర్యలను అరికట్టేందుకు పోలీసు శాఖ చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే బండారు తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై పోలీసులు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అభివృద్ధిపై ముందుకు వెళ్తా
రాజకీయలకు అతీతంగా నియోజకవర్గం అభివృద్ధిపై పనిచేస్తానని.ప్రజలకు ఉపయోగపడే సూచనలు, సలహాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, ఎమ్మెల్యే బండారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లి మంగాదేవి భీమారావు, సీనియర్ టీడీపీ నాయకులు గుత్తుల పట్టాభి, మండల పార్టీ అధ్యక్షులు కొప్పిశెట్టి ప్రసాద్, మేడపాటి కాసు రెడ్డి,ఐ టీడీపీ అధ్యక్షులు కుసుమె సురేష్, రావులపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు కొవ్వూరు అచ్చిరెడ్డి పాల్గొన్నారు.




