Cheepurupalli: సామాన్య కార్యకర్తలకు టీడీపీలో జాతీయ స్థాయి గుర్తింపు
Cheepurupalli: విజయనగరం జిల్లా చీపురుపల్లిలో టీడీపీ జిల్లా కమిటీ సర్వసభ్య సమావేశం జరిగింది.
Cheepurupalli: సామాన్య కార్యకర్తలకు టీడీపీలో జాతీయ స్థాయి గుర్తింపు
Cheepurupalli: నిబద్ధతగా పనిచేసే సామాన్య కార్యకర్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపునిచ్చేది తెలుగుదేశం పార్టీ అని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున కొనియాడారు. శనివారం చీపురుపల్లిలో జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున అధ్యక్షతన టీడీపీ జిల్లా కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కిమిడి నాగార్జున మాట్లాడుతూ..
“టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులుగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించడం పార్టీకి కొత్త శక్తి, దిశను తీసుకొచ్చింది. కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు, అవకాశాలు కల్పించడం టీడీపీ ప్రత్యేకత. విజయనగరం జిల్లా నుంచి బీసీ మహిళలకు జాతీయ పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించడం చారిత్రాత్మక నిర్ణయం. ఇది టీడీపీ సామాజిక న్యాయం, సమాన అవకాశాలపై ఉన్న నిబద్ధతకు నిదర్శనం” అని స్పష్టం చేశారు.
జిల్లా అనుబంధ కమిటీలను బలోపేతం చేయడానికి శాసనసభ్యులతో సమన్వయ సమావేశాలు నిర్వహించి, త్వరితగతిన కమిటీలను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రతి మండలం, ప్రతి గ్రామంలో పార్టీ వ్యవస్థను మరింత పటిష్టం చేయడంపై దృష్టి సారించాలని సూచించారు.
ప్రతిపక్షాలు చేస్తున్న అవాస్తవ విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని, వాస్తవాలను ప్రజలకు చేరవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం, విశాఖపట్నంలో పరిశ్రమల స్థాపన వంటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి ఫలితాలను ప్రతి ఇంటికీ చేరేలా కార్యకర్తలు పనిచేయాలని, గ్రామ స్థాయిలో ప్రజలతో మమేకమై పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు ప్రసాదుల లక్ష్మి వర ప్రసాద్, అకిరి ప్రసాదరావు, వడ్డిపల్లి శ్రీనివాసరావు, బాలబొమ్మ వెంకటేశ్వర్లు, మడపాక తిరుపతి నాయుడు, వెంపడాపు రమణమూర్తి, అల్తి బంగారు బాబు, మొగశాల రమేష్, ముల్లు రమాదేవి, అడ్డా గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




