Road Accident: సూర్యాపేట ఘటన మరవకముందే మరో ఘోరం.. ఒకే గ్రామానికి చెందిన ఏడుగురు మృతి
Road Accident: సూర్యాపేటలో ఆరుగురు మృతి చెందిన ఘోరం మరవకముందే, పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్ దగ్గర గురువారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టింది.
Road Accident
Road Accident: తెలుగు రాష్ట్రాల్లో రహదారులు నెత్తురోడుతున్నాయి. సూర్యాపేటలో ఆరుగురు మృతి చెందిన ఘోరం మరవకముందే, పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్ దగ్గర గురువారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా కొండమంజులూరులో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని ఆటోలో స్వగ్రామానికి వస్తున్న ప్రయాణికులను ప్రమాదం కబళించింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన బాధితులు వేడుక ముగించుకుని ఎంతో సంతోషంగా ఊరికి బయల్దేరారు. తెల్లవారుజామున చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్ వద్దకు రాగానే విజయవాడ నుంచి తిరుపతి వైపు వేగంగా వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వీరి ఆటోను బలంగా ఢీకొట్టింది.
నుజ్జునుజ్జయిన ఆటో, అక్కడికక్కడే ఏడుగురి మృతి
ఢీకొట్టిన తీవ్రతకు ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఆటో డ్రైవర్ బాబుతో పాటు అందులో ప్రయాణిస్తున్న మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మి, గంగమ్మ, మరియమ్మ, సువార్తమ్మ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలారు. బస్సు అతివేగం, ఆటో ఉన్నట్టుండి టర్న్ తీసుకోవడం వల్లే ఈ ఘోరం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. కళ్లముందే తోటి ప్రయాణికులు రక్తసిక్తమై పడిపోవడంతో ఆ ప్రాంతం అరుపులు, కేకలతో అల్లకల్లోలంగా మారింది.
గుంటూరు జీజీహెచ్‌కి క్షతగాత్రుల తరలింపు
ప్రమాద శబ్దం విన్న వెంటనే స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 10 మందిని హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి, ఆపై పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి (జీజీహెచ్) తరలించారు. క్షతగాత్రులలో నలుగురి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
వేలూరు గ్రామంలో శోకసంద్రం
ఒకే గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులు ఈ ఘోర ప్రమాదంలో దుర్మరణం చెందడంతో వేలూరు గ్రామంలో గుండెకోత మిగిలింది. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తారనుకున్న వారు శవాలై తిరిగొస్తుండటంతో బాధితుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.




