Chittoor: ఫోన్ ఎక్కువగా చూడొద్దని తల్లి మందలించిందని.. చిత్తూరు జిల్లాలో 17 ఏళ్ల బాలుడు బలవన్మరణం!
Chittoor: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Chittoor: ఫోన్ ఎక్కువగా చూడొద్దని తల్లి మందలించిందని.. చిత్తూరు జిల్లాలో 17 ఏళ్ల బాలుడు బలవన్మరణం!
Chittoor: నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్ల వాడకం ఎంతగా పెరిగిపోయిందో.. వాటి వల్ల చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకునే యువత సంఖ్య కూడా అంతే ఆందోళనకరంగా పెరుగుతోంది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో కేవలం మొబైల్ ఫోన్ వాడకం విషయంలో తల్లి మందలించిందనే కారణంతో.. 17 ఏళ్ల సుశాంత్ అనే బాలుడు చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘోర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సుశాంత్ ప్రతిరోజూ ఫోన్‌ను ఎక్కువగా చూస్తూ కాలక్షేపం చేస్తుండేవాడు. దీనిని గమనించిన తల్లి.. ఫోన్ అంతగా చూడొద్దని, సమయం వృథా చేయకుండా చదువుపై దృష్టి పెట్టాలని కాస్త గట్టిగా మందలించింది. తల్లి మాటలకు తీవ్రంగా అలిగిన సుశాంత్, క్షణికావేశంలో ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఎంతసేపటికీ బాలుడు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతని మొబైల్ నంబర్‌కు కాల్ చేయగా.. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. బంధువులు, స్నేహితుల ఇళ్లలో గాలించినా ఫలితం లేకపోవడంతో, చివరకు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ క్రమంలోనే స్థానిక గుంతూరు చెరువులో ఒక మృతదేహం తేలియాడుతోందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీయగా.. అది కనిపించకుండా పోయిన సుశాంత్‌దేనని అధికారులు నిర్ధారించారు. తల్లి మందలించిందనే మనోవేదనతోనే బాలుడు క్షణికావేశంలో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కంటికి రెప్పలా కాపాడుకున్న కొడుకు శవమై కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
నిపుణుల హెచ్చరిక: ఈనాటి డిజిటల్ యుగంలో చిన్న విషయాలకే యువత తీవ్ర మనస్తాపానికి గురై ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఎలాంటి సమస్యకైనా ఆత్మహత్య పరిష్కారం కాదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు, యువతకు సంబంధించిన మానసిక ఆరోగ్యం, వారి డిజిటల్ ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని.. వారితో కఠినంగా కాకుండా స్నేహపూర్వకంగా ఉంటూ కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచిస్తున్నారు.




