Chittoor: భర్తను చంపి.. అతడి బైక్‌పైనే ప్రియుడితో చెక్కేసిన కిలాడీ భార్య!
Chittoor: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో దారుణం జరిగింది.
Chittoor: భర్తను చంపి.. అతడి బైక్‌పైనే ప్రియుడితో చెక్కేసిన కిలాడీ భార్య!
Chittoor: వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో కట్టుకున్న భర్తను ఓ భార్య దారుణంగా హత్య చేయించిన ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. గుడికెళదాం రమ్మని నమ్మించి తీసుకెళ్లి, ప్రియుడు, మరో యువకుడితో కలిసి భర్త ప్రాణాలు తీసింది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాలను కుప్పం డీఎస్పీ పార్థసారధి బుధవారం మీడియాకు వెల్లడించారు.
తమిళనాడులోని సూలగిరి పరిధి దేవసానపల్లెకు చెందిన రమేష్.. హోసూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి కుప్పం నియోజకవర్గం బోయనపల్లెకు చెందిన హాసినితో రెండేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న మౌలికశ్రీ అనే కుమార్తె ఉంది. సోమవారం ఈ కుటుంబం బోయనపల్లెలోని హాసిని పుట్టింటికి వచ్చింది. మంగళవారం ఉదయం సంగనపల్లెలోని మల్లప్పకొండ మల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్తున్నామని చెప్పి భార్యాభర్తలు, పాపతో కలిసి బైక్‌పై బయల్దేరారు. అయితే రాత్రయినా వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన హాసిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మల్లప్పకొండ ఆలయ సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించడంతో అసలు నిజం బయటపడింది. ఆలయానికి వెళ్లేటప్పుడు భర్త, పాపతో కలిసి వెళ్లిన హాసిని.. తిరుగు ప్రయాణంలో మాత్రం భర్త తెచ్చిన బైక్‌పైనే మరో ఇద్దరు యువకులతో కలిసి వెళ్తుండటాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో అనుమానం వచ్చి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా, మల్లప్పకొండ ఘాట్ రోడ్డు సమీపంలో రమేష్ మృతదేహం లభ్యమైంది.
తన వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడనే కక్షతో భార్య హాసినే మరో ఇద్దరితో కలిసి రమేష్‌ను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.




