CII Partnership Summit 2026: విశాఖలో ఘనంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 ప్రారంభం
CII Partnership Summit 2026: విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 ఘనంగా ప్రారంభమైంది.
CII Partnership Summit 2026: విశాఖలో ఘనంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 ప్రారంభం
CII Partnership Summit 2026: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో మరో కీలక మైలురాయిగా 'సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026' విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభమైంది. స్థానిక ఆంధ్రా యూనివర్సిటీ (AU) ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు ఈ వేడుకలో పాలుపంచుకున్నారు.
141 ఎంవోయూలు.. 2.46 లక్షల మందికి ఉపాధి!
గత ఏడాది జరిగిన ఒప్పందాల అమలు, వాటి ఫలితాలను బేరీజు వేసుకుంటూ ప్రభుత్వం ఈ ఏడాది భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఈ సదస్సు వేదికగా వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఏపీ ప్రభుత్వంతో 141 కీలక ఒప్పందాలు (MoUs) కుదుర్చుకోనున్నాయి. వీటి ద్వారా రాష్ట్రానికి ఏకంగా రూ.12.14 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు రానుండగా, సుమారు 2.46 లక్షల మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
డోలు వాయించి కళాకారులను ఉత్సాహపరిచిన నేతలు
సదస్సు ప్రాంగణానికి చేరుకున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్, సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌లకు ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ కళారూపాలైన థింసా, తప్పెటగుళ్లు, గరగ నృత్యాలతో కళాకారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్వయంగా డోలు వాయించి కళాకారుల్లో ఉత్సాహం నింపారు. వారితో కలిసి ఫొటోలు దిగడంతో పాటు, ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికులను నేతలు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఏపీ పెవిలియన్, ఎంఎస్‌ఎంఈ (MSME) పెవిలియన్లను నేతలు ప్రారంభించారు. 'స్వర్ణాంధ్ర విజన్' డాక్యుమెంట్‌తో పాటు దేశాభివృద్ధికి ప్రధాని మోదీ చేసిన సూచనలను డిజిటల్ స్క్రీన్‌పై ప్రదర్శించారు.
పవన్‌తో లోకేశ్ భేటీ.. అభినందించిన డిప్యూటీ సీఎం
సదస్సు ప్రారంభానికి ముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న ఇన్వెస్టర్ల వివరాలను పవన్‌కు ఆయన వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించడంలో లోకేశ్ చూపుతున్న ప్రత్యేక చొరవను పవన్ కల్యాణ్ మనస్ఫూర్తిగా అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే ఒరవడి కొనసాగి రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.




