CM Chandrababu: తీరం మనదే.. వేటా మనదే.. పొరుగు రాష్ట్రాలొస్తే భయపడేదే లేదు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: నెల్లూరు జిల్లా కావలిలో సీఎం చంద్రబాబు నాయుడు పొరుగు రాష్ట్రాల బోట్ల చొరబాటుపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు.

Arun Chilukuri
Published on: 19 May 2026 1:05 PM IST
CM Chandrababu
X

CM Chandrababu: తీరం మనదే.. వేటా మనదే.. పొరుగు రాష్ట్రాలొస్తే భయపడేదే లేదు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: "మన తీరంపై మనకే హక్కులు ఉన్నాయి. ఎవరికోసమో మన మత్స్యకారులు జీవనోపాధి కోల్పోవాల్సిన అవసరం లేదు. పొరుగు రాష్ట్రాల బోట్లు మన తీరంలోకి రావడానికి వీల్లేదు. ఒకవేళ ఏ బోటైనా చొరబడితే వెంటనే కలెక్టర్‌కు మెసేజ్‌ వెళ్లే సాంకేతికతను తెస్తున్నాం. ఎవరికీ రాజీ పడే ప్రసక్తే లేదు" అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో నిర్వహించిన ‘మత్స్యకారుల సేవ’ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం పొరుగు రాష్ట్రాల చొరబాట్లపై హెచ్చరికలతో పాటు మత్స్యకారుల అభివృద్ధికి రోడ్ మ్యాప్‌ను ఆవిష్కరించింది.

మత్స్యకారులకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. వేట నిషేధ సమయంలో వారు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు చరిత్రలో తొలిసారిగా భారీ మొత్తాన్ని నేరుగా అకౌంట్లలో వేసినట్లు తెలిపారు. ఈ ఏడాది సాయం మొత్తం 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ. 262 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి విడుదల చేశారు. (ఒక్కో కుటుంబానికి రూ. 20,000 చొప్పున జమ). గతేడాది సాయం గతంలో 1,21,433 కుటుంబాలకు రూ. 243 కోట్ల సాయం అందించినట్లు గుర్తుచేశారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మత్స్య సంపద పాత్రను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. వ్యవసాయం, నిర్మాణ రంగం తర్వాత ఏపీలో అత్యధిక మంది ఆధారపడింది మత్స్య సంపదపైనేనని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న రొయ్యల ఉత్పత్తిలో 80 శాతం కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తుండటం మన రాష్ట్ర మత్స్యకారుల ఘనత అని కొనియాడారు. 2014-19 మధ్య కాలంలో మత్స్యసంపద ఉత్పత్తి 19.18 శాతం పెరిగితే.. గత వైసీపీ హయాంలో ఆ వృద్ధి రేటు నాలుగు రెట్లు పడిపోయిందని సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు.

మత్స్యకార కుటుంబాల్లో ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు సీఎం ఒక సరికొత్త మార్గాన్ని సూచించారు. సముద్రపు నీటితో చేసే ‘సీవీడ్‌ కల్చర్‌’ (సముద్రపు నాచు పెంపకం) ద్వారా అద్భుతమైన ఆదాయం వస్తుందని తెలిపారు. మగవాళ్లు సముద్రంలోకి వేటకు వెళ్తే.. మహిళలు తీరంలో సీవీడ్‌ పండించాలని, దీనివల్ల మహిళల ఆర్థిక స్థితిగతులు మారుతాయని, ఈ మార్గాలను అందరూ పాటించాలని పిలుపునిచ్చారు.

మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపే పూర్తి బాధ్యత తమ కూటమి ప్రభుత్వానిదేనని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ సంచలన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎన్‌.ఎమ్.డి. ఫరూఖ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు, భారీ సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story