Chandrababu: వరుస తుపాన్లతో రైతులకు తీరని నష్టం.. ఏరియల్ సర్వే చేసి పంటలను పరిశీలించిన చంద్రబాబు!
Chandrababu: మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే. బాపట్ల, గుంటూరు జిల్లాల్లో దెబ్బతిన్న పంటల పరిశీలన, రైతులకు భరోసా.
Chandrababu: వరుస తుపాన్లతో రైతులకు తీరని నష్టం.. ఏరియల్ సర్వే చేసి పంటలను పరిశీలించిన చంద్రబాబు!
Chandrababu: వరస తుపాన్ల ధాటికి కోస్తా జిల్లాల్లోని రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మురసు తుపాను తీవ్రంగా ప్రభావితం చేసిన జిల్లాల్లో శుక్రవారం సీఎం స్వయంగా ఏరియల్ సర్వే నిర్వహించారు. బాపట్ల, గుంటూరు జిల్లాల పర్యటనకు వెళ్తున్న సమయంలో హెలికాప్టర్ ద్వారా వరద ముంపును, దెబ్బతిన్న పంట నష్టాన్ని సమగ్రంగా పరిశీలించారు.
అనంతరం సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో దిగిన ముఖ్యమంత్రి, అక్కడి నుంచి రోడ్డు మార్గాన బాపట్ల మండలం జిల్లెలమూడి వంతెన వద్దకు చేరుకున్నారు. తుపాను ఉధృతికి గండ్లు పడిన డ్రెయిన్‌ను పరిశీలించి, నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి సమగ్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అక్కడి నుంచి గుంటూరు జిల్లా కాకుమాను మండలం రేటూరు గ్రామానికి చేరుకున్న సీఎం చంద్రబాబు, నీట మునిగిన వరి పొలాల్లోకి స్వయంగా దిగి దెబ్బతిన్న పైర్లను పరిశీలించారు. డ్రెయిన్లకు గండ్లు పడటంతో పొలాలు చెరువులను తలపిస్తున్న తీరును గమనించి, కన్నీటిపర్యంతమవుతున్న రైతులతో నేరుగా మాట్లాడి ధైర్యం చెప్పారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ.. తుపాను ప్రభావం వల్ల గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల రైతాంగం తీవ్రంగా దెబ్బతిన్నదని, నష్ట తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వం ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుందని స్పష్టం చేశారు.
మొన్నటి వరకు ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఇబ్బంది పెట్టగా, ఇప్పుడు వరస తుపాన్లు దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఒకే సీజన్‌లో వరుసగా రెండు పెద్ద తుపాన్లు రావడం చరిత్రలోనే మొదటిసారని పేర్కొన్నారు. పంటల నష్టపరిహారం అందించి రైతులను ఆదుకుంటామని హామీ ఇస్తూనే, భవిష్యత్ రక్షణ కోసం ప్రతి రైతు తప్పనిసరిగా పంటల బీమా చేసుకోవాలని సీఎం సూచించారు. ప్రభుత్వం నుంచి తక్షణ సహాయక చర్యలు అందించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.




