NTR: మహానాడు వేదికగా బిగ్ డెసిషన్.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ ఏకగ్రీవ తీర్మానం!

NTR: తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్‌కు దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' ఇవ్వాలని మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

Arun Chilukuri
Updated on: 28 May 2026 12:07 PM IST
NTR
X

NTR: మహానాడు వేదికగా బిగ్ డెసిషన్.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ ఏకగ్రీవ తీర్మానం!

NTR: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఆశయాలకు అంకితమై, వాటిని భావితరాలకు అందించడం మనందరి బాధ్యత అని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మహానాడు వేదికగా ఎన్టీఆర్ ఘనతను కొనియాడిన ఆయన.. తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగానే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. మహిళలకు రాజకీయాల్లో 33 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించారని చంద్రబాబు గుర్తుచేశారు. మహిళా సాధికారతకు ఎన్టీఆర్ ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చారని, ఆ అడుగుజాడల్లోనే ప్రస్తుత ప్రభుత్వం నడుస్తోందని స్పష్టం చేశారు.

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన ఎన్టీఆర్‌కు దేశ అత్యున్నత పురస్కారమైన 'భారతరత్న' ఇవ్వాలనేది కోట్లాది మంది తెలుగు ప్రజల డిమాండ్ అని చంద్రబాబు పేర్కొన్నారు. దేశానికి, రాష్ట్రానికి ఆయన చేసిన విశేష సేవలను గుర్తిస్తూ ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలని మహానాడు వేదికగా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

"ఆయన వెండితెరపై పోషించిన పౌరాణిక, చారిత్రక పాత్రలు మళ్లీ వేయాలంటే ఆయనే పుట్టాలి తప్ప ఇతరులకు అది అసాధ్యం" అని చంద్రబాబు కొనియాడారు. కేవలం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే దేశ రాజకీయాలను కుదిపేస్తూ అధికారాన్ని చేజిక్కించుకోవడం ప్రపంచ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాలేదన్నారు. 'సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు' అని ఎన్టీఆర్ ఇచ్చిన మహోన్నత సిద్ధాంతం పార్టీ శ్రేణులకు ఎప్పటికీ శాశ్వత మార్గదర్శకమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story