CII Partnership Summit 2026: పెట్టుబడుల భద్రత కోసం ప్రత్యేక చట్టం చేయాలి.. విశాఖ సీఐఐ సదస్సులో కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు కీలక ప్రతిపాదన!
CII Partnership Summit 2026: విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు.
CII Partnership Summit 2026: పెట్టుబడుల భద్రత కోసం ప్రత్యేక చట్టం చేయాలి.. విశాఖ సీఐఐ సదస్సులో కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు కీలక ప్రతిపాదన!
CII Partnership Summit 2026: నమ్మకమైన వ్యాపార భాగస్వామి ఉంటే విజయాలు తథ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. తన నాయకత్వంలో ఇప్పటివరకు 8 సీఐఐ భాగస్వామ్య సదస్సులు జరిగాయని, తనపై ఉన్న నమ్మకంతో ఎందరో పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారని తెలిపారు.
2024 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో రూ. 22.6 లక్షల కోట్ల విలువైన 714 ఒప్పందాలు కుదుర్చుకున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గడిచిన రెండున్నరేళ్లలో పెట్టుబడుల ఆకర్షణలో వేగంగా పురోగతి సాధిస్తున్నామని, ఇప్పటికే రూ. 7.3 లక్షల కోట్ల విలువైన 303 ప్రాజెక్టులు గ్రౌండింగ్ దశలో ఉన్నాయని వివరించారు.
దేశంలోనే మొదటి హైడ్రోజన్ వ్యాలీకి ఏపీ వేదిక కాబోతోందని, భవిష్యత్ సంస్కరణలకు తిరుపతి స్పేస్ సిటీ కేంద్రంగా మారనుందని చెప్పారు. త్వరలోనే డ్రోన్ ఎయిర్‌టాక్సీలు అందుబాటులోకి రాబోతున్నాయని, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధిలో కీలక ముందడుగు పడిందని తెలిపారు. భారత్ పెట్టుకున్న 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి లక్ష్యంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 160 గిగావాట్లు అందించబోతున్నామని స్పష్టం చేశారు.
ఈ సదస్సు వేదికగా సీఎం చంద్రబాబు పెట్టుబడిదారులకు భరోసా కల్పించేలా ఒక కీలక ప్రతిపాదన చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడు తలెత్తే కక్షపూరిత రాజకీయాల నేపథ్యంలో, పరిశ్రమల రక్షణ కోసం 'పెట్టుబడుల భద్రతా చట్టం' (Investment Protection Act) తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కోరారు.
రాష్ట్ర స్థాయిలో దీనిపై చట్టం చేసి పంపుతామని, దానికి కేంద్రం ఆమోదం తెలిపేలా చూడాలని విన్నవించారు. ఒకవేళ జాతీయ స్థాయిలో ఇలాంటి చట్టం చేయగలిగితే మరింత సంతోషిస్తానని, తద్వారా అభివృద్ధిలో భారత్ మరింత వేగంగా దూసుకెళ్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.




