CM Chandrababu: రాజకీయాల్లో నేరగాళ్లతో పోరాటం.. నా 50 ఏళ్ల జీవితంలో ఇదే మొదటిసారి
CM Chandrababu: వైసీపీని 'కిల్లర్ పార్టీ'గా అభివర్ణిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో నేరగాళ్లను ఎదుర్కోవడం తనకూ కొత్తేనని, టీడీపీ కార్యకర్తలు నేరపూరిత రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
CM Chandrababu: రాజకీయాల్లో నేరగాళ్లతో పోరాటం.. నా 50 ఏళ్ల జీవితంలో ఇదే మొదటిసారి
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో నేరపూరిత పోకడలపై ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన క్లస్టర్ ఇంఛార్జ్‌ల శిక్షణా తరగతుల్లో భాగంగా 'కాఫీ కబుర్లు' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ తీరును ఎండగడుతూ కార్యకర్తలకు కీలక దిశానిర్దేశం చేశారు.
"నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పోరాటాలు చేశాను కానీ, నేరగాళ్లతో ఏనాడూ పోరాడలేదు. ప్రస్తుత పరిణామాల్లో క్రిమినల్స్‌తో రాజకీయం చేయాల్సిన పరిస్థితి రావడం నాకు కూడా కొత్తగానే ఉంది" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీని ఒక 'కిల్లర్ పార్టీ'గా ఆయన అభివర్ణించారు. ఆ పార్టీ నాయకులు అరాచకాలకు పాల్పడటమే కాకుండా, ఆ నేరాలను ఇతరులపై నెట్టేందుకు ప్రయత్నిస్తారని ఆరోపించారు.
ఇటీవల కడపలో జరిగిన హత్యలను చంద్రబాబు ఉదాహరణగా చూపారు. ప్రభుత్వ భూముల పంపకాల్లో తేడాలు రావడంతో సొంత పార్టీ కార్యకర్త దస్తగిరినే హత్య చేశారని, ఈ దోపిడీలో వైసీపీ ముఖ్య నేతల హస్తం ఉందని ఆరోపించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఉదంతాన్ని గుర్తుచేస్తూ, నిందితులు సాక్షులను సైతం బెదిరిస్తున్నారని మండిపడ్డారు. సొంత కార్యకర్తలను కార్ల కింద తొక్కించి చంపే సంస్కృతి ఆ పార్టీదని విమర్శించారు.
టీడీపీలో కార్యకర్తలే అసలైన అధినేతలని, ప్రతి ఒక్కరినీ నాయకుడిగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 2019-24 మధ్య జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు నిత్యం గుర్తుచేయాలని కోరారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను, నిధుల కొరత ఉన్నా పడుతున్న కష్టాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యకర్తలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, పార్టీ ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజలకు నిరంతరం చేరువగా ఉంటూ పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు హితవు పలికారు.




