CM Chandrababu: అధికారం ఉందని ఇగోకు పోతే మీరే నష్టపోతారు.. నేతలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్!
CM Chandrababu: తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు నేతలకు కీలక హెచ్చరికలు చేశారు. అధికారం ఉందని ఇగోకు పోవద్దని, తప్పు చేస్తే నేరుగా హెడ్ లైన్స్ లోకి వెళ్తారని స్పష్టం చేశారు.
CM Chandrababu: అధికారం ఉందని ఇగోకు పోతే మీరే నష్టపోతారు.. నేతలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్!
CM Chandrababu: తెలుగుదేశం పార్టీ నూతన కమిటీల ప్రమాణ స్వీకార వేదికగా ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మరింత కటువుగా మాట్లాడిన ఆయన, అధికార గర్వంతో ప్రవర్తిస్తే ఊరుకోబోనని స్పష్టం చేశారు.
నేరుగా ‘హెడ్‌లైన్స్’లోకి వెళ్తారు.. జాగ్రత్త!
పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించే వారిపై చంద్రబాబు మండిపడ్డారు. "మీరు చేసే తప్పులు నేరుగా హెడ్‌లైన్స్‌లోకి వెళ్తాయి.. అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలి. ప్రజలు ప్రతి ఒక్కరినీ గమనిస్తున్నారు. మీరు ఎవరిని కలుస్తున్నారు? ఏం చేస్తున్నారు? అనేది అందరికీ తెలుస్తోంది. అధికారం ఉందని ఇగోకు పోతే నష్టపోయేది మీరే" అని ఘాటుగా హెచ్చరించారు. ఫ్లెక్సీల దగ్గర గొడవలు పడటం, కార్యకర్తలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నాలుగు దశాబ్దాలుగా కమిటీలను నియమిస్తున్నా, ఈసారి అంత సమగ్రంగా, పారదర్శక వడపోత తర్వాతే ఎంపిక చేశామని చంద్రబాబు తెలిపారు. మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వడమే కాకుండా, చదువుకున్న వారికి మంత్రి పదవులు ఇచ్చామని చెప్పారు. ఒక మండల పార్టీ అధ్యక్షురాలికి, క్లస్టర్ ఇన్‌చార్జికి పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించడం ద్వారా 'కార్యకర్తే అధినేత' అనే సిద్ధాంతాన్ని ఆచరణలో చూపించామన్నారు.
లోకేశ్ శ్రమకు గుర్తింపు.. యువతకు ప్రాధాన్యత
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేశ్ పోషించిన పాత్రను చంద్రబాబు కొనియాడారు. కార్యకర్తల శిక్షణ, సంక్షేమ కార్యక్రమాలను ఆయన సమర్థవంతంగా నిర్వహించారని, ఇప్పుడు రాష్ట్రానికి 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారని తెలిపారు.
రాష్ట్ర పరిస్థితిపై విశ్లేషణ
రాష్ట్ర ఆర్థిక స్థితి క్లిష్టంగా ఉన్నా, కేంద్ర సహకారంతో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నామని సీఎం వివరించారు. సూపర్ సిక్స్ హామీల అమలు, పెన్షన్ల పంపిణీ వంటి అంశాలను ప్రస్తావిస్తూనే.. ప్రతిపక్షాల ఫేక్ ప్రచారాలకు కాలం చెల్లిందని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ కూటమిలో ఉన్నందున ఐకమత్యంతో ఉంటూ, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలకు చెడ్డపేరు రాకుండా గ్రామస్థాయి వరకు పనిచేయాలని పిలుపునిచ్చారు.




