CM Chandrababu: మోసమే కాంగ్రెస్ నైజం.. 30 ఏళ్లుగా ఆడబిడ్డలను వంచిస్తూనే ఉన్నారు..
CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ దేశద్రోహానికి పాల్పడిందని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. దశాబ్దాలుగా మహిళలను మోసం చేయడం కాంగ్రెస్‌కు అలవాటని విమర్శించారు.
CM Chandrababu: మోసమే కాంగ్రెస్ నైజం.. 30 ఏళ్లుగా ఆడబిడ్డలను వంచిస్తూనే ఉన్నారు..
CM Chandrababu: మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన 'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై తీవ్రంగా స్పందించారు.
మహిళలను మోసం చేయడం కాంగ్రెస్‌కు కొత్తేమీ కాదని, గత 30 ఏళ్లుగా ఆ పార్టీ ఇదే పని చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. "నిన్న బిల్లు వీగిపోవడంతో మహిళా రిజర్వేషన్ల అమలు మరో పదేళ్లు అంటే 2034కి వెళ్లే ప్రమాదం ఏర్పడింది. 1996 నుంచి నేటి వరకు అనేకసార్లు బిల్లును అడ్డుకుని మహిళా శక్తికి కాంగ్రెస్ తీరని అన్యాయం చేసింది" అని ఆయన మండిపడ్డారు. యూపీఏ హయాంలో రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లును అప్పట్లో లోక్‌సభలో ఎందుకు ప్రవేశపెట్టలేదని ఆయన నిలదీశారు.
మహిళా బిల్లు వస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను సీఎం తోసిపుచ్చారు. జనగణన, డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాతే బిల్లుపై ముందుకెళ్లాలనే నిబంధన ఉన్నప్పటికీ, ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రిజర్వేషన్లు దక్కకుండా చేయడం 'దేశద్రోహం' మరియు 'మహిళలకు చేసిన దగా' అని ఆయన హెచ్చరించారు.
ఆడబిడ్డలు మగవారికంటే ఎక్కువగా సంపాదిస్తున్నారని, వారి శక్తిని తక్కువ అంచనా వేయకూడదని చంద్రబాబు పేర్కొన్నారు. 'తల్లికి వందనం', 'స్త్రీ శక్తి' వంటి కార్యక్రమాల ద్వారా తమ ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.




