Amalapuram: కువైట్ మస్కట్ నరకం నుంచి కోనసీమ మహిళలకు విముక్తి.. రప్పించిన కలెక్టర్

Amalapuram: కువైట్, మస్కట్ దేశాల్లో తీవ్ర ఇబ్బందులు, వేధింపులు ఎదుర్కొన్న ఇద్దరు ఆంధ్రప్రదేశ్ మహిళలను డాక్టర్ ఆర్.మహేష్ కుమార్ చొరవతో సురక్షితంగా స్వదేశానికి రప్పించారు.

PRABHU, RAZOLE
Updated on: 17 May 2026 5:06 PM IST
Amalapuram
X

Amalapuram: కువైట్ మస్కట్ నరకం నుంచి కోనసీమ మహిళలకు విముక్తి.. రప్పించిన కలెక్టర్

అమలాపురం: కువైట్ మరియు మస్కట్ దేశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఇద్దరు మహిళలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్ కుమార్ చొరవతో సురక్షితంగా స్వదేశానికి రప్పించారు. కాట్రేనికోన మండలం కుండలేశ్వరం గ్రామానికి చెందిన వి.దుర్గా భవాని మరియు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం కొలమూరు గ్రామానికి చెందిన సి.హెచ్.జయలక్ష్మి విదేశాల్లో ఎదుర్కొన్న కష్టాల నుంచి కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ (KCM) సహకారంతో విముక్తి పొందారు.

వి.దుర్గా భవాని 2025 నవంబర్‌లో ఉపాధి కోసం మస్కట్‌కు వెళ్లి గృహ సహాయకురాలిగా పనిచేయడం ప్రారంభించారు. అక్కడ తీవ్రమైన పని ఒత్తిడి, అధిక శ్రమతో బాధపడుతూ ఏజెంట్‌ను సంప్రదించగా ఆమెను మరో ఇంటికి మార్చారు.అయితే అక్కడ పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. భారమైన పనులు చేయించడం, తిండి పెట్టకపోవడం, చిత్రహింసలకు గురిచేయడం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దిక్కుతోచని పరిస్థితిలో తెలిసిన వారి సలహాతో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌ను సంప్రదించగా అధికారులు సంబంధిత ఏజెంట్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించి ఆమెను సురక్షితంగా భారత్‌కు రప్పించారు.

అలాగే సి.హెచ్.జయలక్ష్మి 2026 ఫిబ్రవరిలో ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లారు. అక్కడ ఆమెను వంట పనుల పేరుతో తీసుకెళ్లి ఇంటి పనులన్నీ చేయించడం, పిల్లలను చూసుకోవడం వంటి కఠిన పరిస్థితుల్లో పనిచేయించారు. పనులు చేయలేకపోతే కొట్టడం, తిట్టడం వంటి వేధింపులు ఎదుర్కొన్నారు. తరువాత మరో ఇంటికి మార్చినా పరిస్థితులు మారలేదు. రాత్రి 12 గంటల వరకు పని చేయించి, ఉదయం 6 గంటలకు మళ్లీ పనిలో పెట్టడం వల్ల తిండి, నిద్ర లేక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. ఈ పరిస్థితిని ఆమె భర్తకు తెలియజేయగా, రాజమండ్రి కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ సమర్పించారు. వికాస సంస్థ ద్వారా ఫిర్యాదు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌కు చేరగా వెంటనే స్పందించిన అధికారులు ఏజెంట్‌తో సమన్వయం చేసి ఆమెను కూడా సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ నోడల్ అధికారి వి.సుబ్బారావు, సమన్వయకర్త గోళ్ళ రమేష్ మాట్లాడుతూ.. విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే వలస కార్మికులకు అవసరమైన సహాయం అందించడంలో సంస్థ కట్టుబడి ఉందన్నారు. జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ మాట్లాడుతూ.. విదేశాలకు ఉపాధి కోసం వెళ్లే వారు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి పొందిన రిజిస్టర్డ్ ఏజెంట్ల ద్వారానే వెళ్లాలని ప్రజలకు సూచించారు. విదేశాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌ను సంప్రదిస్తే ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వ సమన్వయంతో ఇద్దరు బాధితులు సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కడియాల సత్తిబాబు, షేక్ బీబి సఫియా తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story