Nellore: రైతులకు పగటిపూట విద్యుత్.. పీఎం కుసుమ్ పురోగతి

Nellore: నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పీఎం కుసుమ్ పథకంపై సమీక్ష నిర్వహించారు. 437 ఎకరాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు.

V. Narasimhulu, Nellore
Published on: 13 April 2026 9:06 PM IST
Nellore
X

Nellore: రైతులకు పగటిపూట విద్యుత్.. పీఎం కుసుమ్ పురోగతి

Nellore: జిల్లా కలెక్టర్ కార్యాలయం (కలెక్టరేట్) లో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధ్యక్షతన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సోమవారం తన చాంబర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కుసుమ్ (PM-KUSUM) పథకం పురోగతిపై సమగ్రంగా చర్చించారు.

జిల్లాలో ఈ పథకం అమలుకు సంబంధించి మొత్తం 437 ఎకరాల భూమిని గుర్తించామని, అందులో 215 ఎకరాల భూమి ఇప్పటికే స్వాధీనం చేసుకోవడం పూర్తయిందని, అలాగే మిగిలిన భూమిలో 22 ఎకరాలను అతి త్వరలోనే స్వాధీనం చేసుకునే ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఈ భూములపై సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసి, జిల్లాలోని వ్యవసాయ వినియోగదారులకు పగటి సమయంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం ఈ పథక ప్రధాన లక్ష్యమని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు.

అలాగే, ఈ భూములపై ఉత్పత్తి అయ్యే సోలార్ విద్యుత్తును జిల్లాలోని అన్ని విద్యుత్ డివిజన్లకు పంపిణీ చేసి, వ్యవసాయ రంగానికి స్థిరమైన మరియు నిరంతర విద్యుత్ సరఫరా కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పథకం అమలులో ఎటువంటి ఆలస్యం లేకుండా, సమయపాలనతో పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ కె. రాఘవేంద్రం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (టెక్నికల్) బాలచంద్ర , ఆత్మకూరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాను నాయక్, కావలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బెనర్జీ, నెల్లూరు టౌన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ , రూరల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్ , గూడూరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరేంద్ర రెడ్డి , డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (కమర్షియల్) మునీంద్ర , అసిస్టెంట్ ఇంజనీర్ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు మరియు నెడ్ క్యాబ్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ రామలింగయ్య అధికారులు పాల్గొన్నారు .

జిల్లాలో పీఎం కుసుమ్ పథకాన్ని వేగవంతంగా అమలు చేసి, వ్యవసాయ రంగానికి విద్యుత్ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే దిశగా విద్యుత్ శాఖ కృషి చేస్తోందని అధికారులు తెలిపారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story