Amalapuram: కోనసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
Amalapuram: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రానున్న ఐదు రోజులు ఎండ తీవ్రత పెరగనుంది.
Amalapuram: కోనసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అమలాపురం: రానున్న ఐదు రోజులు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా 19 మండలాల పరిధిలో సుమారుగా 41 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 54 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉందని రియల్ టైం గవర్నెన్స్ ద్వారా వాతావరణ కేంద్రం తెలిపిందన్నారు.
కావున రాబోయే 5 రోజులు కోనసీమ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అయితే వర్షపాతం పరంగా రానున్న 5 రోజులకు ఎటువంటి ముందస్తు ప్రత్యేక హెచ్చరికలు జారీ కాలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లకుండా ఉండాలని, తగినంత నీరు తీసుకోవాలని, వృద్ధులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
ప్రజలకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేలా రద్దీగా ఉన్న ప్రాంతాలు, ప్రజలు ఎక్కువగా తిరిగే చోట్ల చల్లని మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకె ట్లను అందుబాటులో ఉంచాలన్నారు. వడ గాలుల నుంచి ఎలా రక్షించు కోవాలో ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సామాజిక మాధ్యమాల ద్వారా నిరంతరం సమాచారాన్ని చేరవేయాలన్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకుండా ఉండాలన్నారు. మరోవైపు ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న మూగ జీవులు, పక్షులకు కూడా నీటి తొట్టెలు, మట్టి కుండలతో త్రాగు నీటిని ఏర్పాటు చేయాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా త్రాగు నీటి కొరత రాకుండా చూడాలన్నారు.
నీటి ఇబ్బందులు ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని స్పష్టం చేశారు. 2015లో బలమైన ఎల్ నినో కారణంగా 50.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డు అయ్యిందని. ఈ ఏడాదిలోనూ ఎల్ నినో ప్రభావంతో ఇప్పటి వరకూ 48 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వెల్లడించారు. గడచిన మూడు రోజులుగా 45 డిగ్రీల నుంచి 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరిగాయన్నారు.




