కరెంట్ బిల్లుల భారానికి సోలార్ బ్రేక్.. కోనసీమ జిల్లాలో 10 మేజర్ పంచాయతీల ఎంపిక!
కోనసీమ జిల్లాలో ఏటా రూ. కోటికి పైగా కరెంట్ బిల్లులు కడుతున్న 10 మేజర్ పంచాయతీల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
అమలాపురం: డాక్టర్.బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఏడాదికి కోటి రూపాయలకు పైగా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్న 10 మేజర్ గ్రామ పంచాయతీలను గుర్తించి, వాటిలో పైలట్ ప్రాజెక్టుగా సోలార్ విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్, నెడ్‌క్యాప్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వీధి దీపాలు, రక్షిత మంచినీటి పథకాల నిర్వహణ కారణంగా పంచాయతీలపై విద్యుత్ బిల్లుల భారం పెరుగుతోందన్నారు. ఈ భారాన్ని తగ్గించేందుకు పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనతో అనుసంధానించి సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రతి పంచాయతీ ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ స్థలాలు, భవనాల పైకప్పుల వైశాల్యం, సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించి వాస్తవిక ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ, నెడ్‌క్యాప్ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలనలు నిర్వహించి అవసరమైన సోలార్ సామర్థ్యాన్ని అంచనా వేయాలన్నారు.
సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా విద్యుత్ బిల్లుల భారం తగ్గి, ఆదా అయ్యే నిధులను గ్రామాభివృద్ధి పనులకు వినియోగించుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అలాగే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు పీఎం సూర్యఘర్ పథకం కింద ఉచిత సోలార్ కనెక్షన్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో నిర్దేశించిన సోలార్ కనెక్షన్ల లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో కూడా సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో నెడ్‌క్యాప్, ఈపీడీసీఎల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.




