Amalapuram: కలెక్టర్ మహేష్ కుమార్ కీలక ఆదేశాలు

Amalapuram: అర్జీల పునరావృతం కాకుండా నూటికి నూరు శాతం సంతృప్తికర పరిష్కారం చూపాలని అధికారులకు కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆదేశం.

PRABHU, RAZOLE
Updated on: 1 Jun 2026 2:03 PM IST
Amalapuram
X

Amalapuram: కలెక్టర్ మహేష్ కుమార్ కీలక ఆదేశాలు

అమలాపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అందే ప్రతి అర్జీని ప్రత్యేకంగా పరిశీలించి, అదే అర్జీ మళ్లీ పునరావృతం కాకుండా నాణ్యమైన, నూటికి నూరు శాతం సంతృప్తికర పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.

సోమవారం డాక్టర్.బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియా దేవి, డీఆర్ఓ వి. సుబ్బారావు, అమలాపురం ఆర్డీఓ జి. మమ్మీలు పాల్గొని సుమారు 185 వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్జీదారులతో నేరుగా మాట్లాడి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.

అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పూర్తి సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. సాంకేతిక లేదా చట్టపరమైన కారణాల వల్ల సమస్య పరిష్కారం సాధ్యం కాకపోతే, అందుకు గల కారణాలను స్పష్టంగా వివరించేలా ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని సూచించారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం లేదా ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియా దేవి మాట్లాడుతూ.., ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడం లక్ష్యంగా ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story