Tirumala : ఎండల నుంచి భక్తులకు ఉపశమనం.. రూ.3.21 కోట్లతో టీటీడీ కొండంత ఏర్పాట్లు

Tirumala : తిరుమల గిరిపై భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు మండిపోతుండటంతో ఏడుకొండల వాడి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగింది.

CR Reddy
Published on: 21 April 2026 10:09 AM IST
Tirumala
X

Tirumala 

Tirumala : తిరుమల గిరిపై భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు మండిపోతుండటంతో ఏడుకొండల వాడి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగింది. నిప్పుల కొలిమిలా మారుతున్న వాతావరణం నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేందుకు ఏకంగా రూ.3.21 కోట్లు ఖర్చు చేస్తూ చల్లని ఏర్పాట్లు చేస్తోంది. కేవలం ఆలయ పరిసరాల్లోనే కాకుండా, భక్తులు నడిచే దారుల నుంచి క్యూలైన్ల వరకు ప్రతిచోటా టీటీడీ తనదైన ముద్ర వేస్తోంది.

కూల్ పెయింటింగ్‌తో కాలినడక సాఫీగా

తిరుమల మాడవీధుల్లో నడిచేటప్పుడు భక్తుల కాళ్లు కాలకుండా ఉండేందుకు టీటీడీ ఇంజనీరింగ్ విభాగం అత్యాధునిక సాంకేతికతను వాడుతోంది. సుమారు రూ.50 లక్షల వ్యయంతో ప్రధాన వీధులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, వరాహ స్వామి గెస్ట్ హౌస్ వంటి ప్రాంతాల్లో కూల్ పెయింటింగ్ వేశారు. దీనివల్ల నేల వేడెక్కకుండా ఉండి, భక్తులు ప్రశాంతంగా నడవడానికి వీలుంటుంది. కేవలం మాడవీధుల్లోనే రూ.17 లక్షలు, సేవా సదన్ ప్రాంతంలో రూ.16 లక్షలు, క్యూ కాంప్లెక్స్ వద్ద రూ.18 లక్షలు చొప్పున ఈ పెయింటింగ్ కోసం ఖర్చు చేశారు.

జర్మన్ షెడ్లు - ఆధునిక సౌకర్యాలు

ఎండ నేరుగా తగలకుండా శ్రీవారి ఆలయం ఎదుట భారీ జర్మన్ షెడ్లను ఏర్పాటు చేశారు. గతంలో ఎండలో నిలబడి ఇబ్బంది పడే భక్తులకు ఇవి పెద్ద ఊరటనిస్తున్నాయి. అలాగే కళ్యాణకట్ట, లడ్డూ కౌంటర్లు, రాంభగీచా వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక షెల్టర్లను నిర్మించారు. తాగునీటి కోసం అదనపు పాయింట్లు, నిరంతరం అన్నప్రసాద వితరణ జరిగేలా టీటీడీ జాగ్రత్తలు తీసుకుంది. భక్తులు ఎక్కడా అసౌకర్యానికి గురికాకుండా బాట గంగమ్మ గుడి నుంచి బారికేడ్లు, నీడ కోసం తాత్కాలిక షెడ్లు నిర్మించారు.

డేటా అనలిటిక్స్‌తో దర్శన పర్యవేక్షణ

ఈ ఏడాది వేసవి సెలవుల కారణంగా నిత్యం లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రతి నిమిషం నిఘా ఉంచారు. డేటా అనలిటిక్స్ సాయంతో ఏ క్యూలైన్‌లో ఎంత మంది ఉన్నారు? దర్శనానికి ఎంత సమయం పడుతుంది? అనే విషయాలను విశ్లేషిస్తూ భక్తులకు సమాచారం అందిస్తున్నారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం వంటి చోట్ల జారీ చేసే ఎస్ఎస్డీ టోకెన్ల విషయంలో కూడా భక్తులకు వేచి ఉండే శ్రమ లేకుండా మార్పులు చేస్తున్నారు.

భక్తులకు కొండంత భరోసా

వేసవి తాపాన్ని తట్టుకునేందుకు టీటీడీ చేసిన ఈ ఏర్పాట్లపై భక్తజనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా లడ్డూ కౌంటర్లు, ప్యాక్-4 వంటి చోట్ల కొత్తగా ఏర్పాటు చేసిన షెల్టర్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు దారిలో వచ్చే భక్తుల కోసం అదనపు మరుగుదొడ్లు, చల్లని నీటి వసతిని మెరుగుపరిచారు. భానుడి భగభగలు ఎలా ఉన్నా, శ్రీవారి దర్శనం మాత్రం చల్లగా, ప్రశాంతంగా సాగేలా టీటీడీ తీసుకున్న ఈ చర్యలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story