Srisailam: శ్రీశైలంలో ఢిల్లీ యాత్రికులకు సైబర్ షాక్.. నకిలీ వెబ్‌సైట్‌తో గదుల బుకింగ్ పేరిట భారీ మోసం!
Srisailam: శ్రీశైలంలో భక్తులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఢిల్లీకి చెందిన యాత్రికులు నకిలీ వెబ్‌సైట్ ద్వారా రూ. 15 వేలు పోగొట్టుకోగా, శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు స్పందించి వారికి అండగా నిలిచారు.
Srisailam: శ్రీశైలంలో ఢిల్లీ యాత్రికులకు సైబర్ షాక్.. నకిలీ వెబ్‌సైట్‌తో గదుల బుకింగ్ పేరిట భారీ మోసం!
Srisailam: పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో సైబర్ మోసం వెలుగుచూసింది. నకిలీ వెబ్‌సైట్ల ద్వారా భక్తులను బురిడీ కొట్టిస్తున్న ముఠా, తాజాగా ఢిల్లీకి చెందిన యాత్రికుల నుంచి వేల రూపాయలు కాజేసింది. అయితే, ఈ ఘటనపై శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు మానవత్వంతో స్పందించి బాధితులకు అండగా నిలిచారు.
ఢిల్లీకి చెందిన ఆనంద్ కుమార్ అనే భక్తుడు, శ్రీశైలం మల్లికార్జున సదన్‌లో 9 ఏసీ గదులను ఒక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకున్నారు. ఇందుకోసం పేటీఎం ద్వారా రూ. 15 వేలు చెల్లించారు. శనివారం ఢిల్లీకి చెందిన 27 మంది యాత్రికులు హైదరాబాద్ నుంచి టూరిస్ట్ బస్సులో శ్రీశైలం చేరుకున్నారు. మల్లికార్జున సదన్ వద్దకు వెళ్లి గదుల గురించి విచారించగా.. అక్కడ ఎలాంటి బుకింగ్ జరగలేదని దేవస్థానం సిబ్బంది తెలిపారు. దీంతో తాము సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయామని బాధితులు గుర్తించి లబోదిబోమన్నారు.
విషయం తెలుసుకున్న దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తక్షణమే స్పందించారు. సుదూర ప్రాంతం నుంచి వచ్చిన యాత్రికులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వారికి ఉచిత వసతి, భోజనం మరియు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేయించి తన ఉదారతను చాటుకున్నారు. బాధితుల నుంచి దేవస్థానం పీఆర్‌వో లిఖితపూర్వక ఫిర్యాదును స్వీకరించారు.
యాత్రికులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లపై కేసు నమోదు చేయాలని ఈవో నిర్ణయించారు. భక్తులు కేవలం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ ద్వారానే గదులు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని, గుర్తు తెలియని వెబ్‌సైట్లను నమ్మి నగదు చెల్లించి మోసపోవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.




