Andhra Pradesh Weather Update: బంగాళాఖాతంలో అలజడి..ఏపీకి మరో గండం.. కీలకం కానున్న 48 గంటలు!
Andhra Pradesh Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 'అక్వాన్' తుఫానుగా మారనుంది.
Andhra Pradesh Weather Update: బంగాళాఖాతంలో అలజడి..ఏపీకి మరో గండం.. కీలకం కానున్న 48 గంటలు!
Cyclone Akwan: ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ పెను తుఫానుగా మారేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ , విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అందించిన తాజా అంచనాల ప్రకారం, రాబోయే కొద్ది రోజులు తీరప్రాంత ప్రజలకు అత్యంత కీలకం కానున్నాయి.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ రేపటికి సుస్పష్టమైన అల్పపీడనంగా మారనుంది. ఉదయానికి అదే ప్రాంతంలో ఇది వాయుగుండంగా రూపాంతరం చెందుతుంది. ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో పూర్తిస్థాయి తుఫానుగా బలపడనుంది. దీనికి 'అక్వాన్' అని నామకరణం చేయనున్నారు. 17వ తేదీ నుంచి ఏపీపై దీని ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. ఉత్తర తమిళనాడు – కోస్తాంధ్ర తీరాల వైపు దూసుకొస్తూ, ఈ నెల 19వ తేదీ సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఆదివారం నుంచి సముద్రం అత్యంత అలజడిగా మారనుండటంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్ళరాదని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు తక్షణమే సురక్షితంగా తీరానికి తిరిగి రావాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ సూచించారు.
సముద్రంపై తుఫాను కదలికల విషయంలో నవంబర్ 16, 17 తేదీలు అత్యంత కీలకమైనవి. వాయుగుండంగా బలపడిన తర్వాతే తుఫాను గమనంపై పూర్తి స్పష్టత వస్తుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ పీఎల్ఎన్ మూర్తి తెలిపారు. ఇది కచ్చితంగా ఏ దిశగా వెళ్తుంది, ఎంతవరకు బలపడుతుంది, ఎక్కడ తీరం దాటుతుంది అనే విషయాలను నవంబర్ 17న కచ్చితంగా అంచనా వేయగలిగే అవకాశం ఉంది.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందిస్తోంది. తుఫాన్ తీవ్రతపై సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు, వదంతులను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని, కేవలం వాతావరణ శాఖ , విపత్తుల నిర్వహణ సంస్థ అందించే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.




