Cyclone Arnab: ఏపీని వణికిస్తున్న ‘అర్నబ్ తుపాను’.. సముద్రంలో ఎగసిపడుతున్న అలలు.. వైజాగ్, బాపట్ల బీచ్‌లు బంద్!

Cyclone Arnab: అర్నబ్ తుపాను ధాటికి ఏపీ తీరప్రాంతాలు వణికిపోతున్నాయి. విశాఖ, బాపట్లలోని బీచ్‌లను అధికారులు మూసివేశారు.

Arun Chilukuri
Published on: 27 Oct 2026 11:45 AM IST
Cyclone Arnab
X

Cyclone Arnab: ఏపీని వణికిస్తున్న ‘అర్నబ్ తుపాను’.. సముద్రంలో ఎగసిపడుతున్న అలలు.. వైజాగ్, బాపట్ల బీచ్‌లు బంద్!

Cyclone Arnab: 'అర్నబ్ తుపాను' (Cyclone Arnab) తీవ్ర రూపం దాల్చడంతో ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాల్లో అధికారులు తీవ్ర ఆంక్షలు విధిస్తున్నారు. విశాఖపట్నం సహా పలు కోస్తా జిల్లాల తీరాల్లో సముద్రం అలజడిగా మారి, అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం ముందుకు వస్తుండటంతో పర్యాటకుల భద్రత దృష్ట్యా ప్రధాన బీచ్‌లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.

విశాఖపట్నం ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన రుషికొండ, ఆర్కే బీచ్‌లలోకి పర్యాటకుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. బాపట్ల జిల్లా చీరాల, ఓడరేవు, రామాపురం, పొట్టిసుబ్బయ్యపాలెం బీచ్‌లను అధికారులు మూసివేశారు.

హైదరాబాద్ సహా ఇతర సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు బీచ్ సందర్శనలకు రావద్దని అధికారులు స్పష్టం చేశారు. అధికారిక ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.

తుపాను ప్రభావంతో విశాఖ నగర వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. మహారాణిపేట అంగడిదిబ్బ వద్ద భారీ చెట్టు విరిగిపడటంతో ఓ పాన్ షాపు పూర్తిగా ధ్వంసమైంది. రాంనగర్ సేవాసదన్ స్కూల్ సమీపంలోని రహదారిపై చెట్టు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

మత్స్యకారులు తమ వేటను నిలిపివేసి బోట్లను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్‌ జెట్టీ, కొత్తపాలెం, నక్షత్రనగర్‌, లంకెవానిదిబ్బ, పెనుమూడి తీరాల్లో బోట్లను లంగరు వేశారు.

కాకినాడ జిల్లాలో తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు 101 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజా సహాయం కోసం కాకినాడ కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

కంట్రోల్ రూమ్ నంబర్లు: 0884-2356801, 98499 03879

తుపాను సహాయక చర్యలకు విద్యుత్‌శాఖ సిబ్బంది నిరంతరం సిద్ధంగా ఉండాలని ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వీతేజ్ ఆదేశించారు. పునరుద్ధరణ చర్యలకు అవసరమైన సామగ్రి, యంత్రాలను సిద్ధంగా ఉంచామన్నారు. విద్యుత్ సమస్యలు తలెత్తితే 1912 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.