Cyclone Murasu: ఏపీ వైపు దూసుకొస్తున్న మురాసు తుఫాన్.. నవంబర్ 3న తీరం దాటే అవకాశం

బంగాళాఖాతంలో ఏర్పడిన మురాసు తుఫాన్ ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. నవంబర్ 3న తీరం దాటే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

CR Reddy
Published on: 2 Nov 2026 6:43 AM IST
Cyclone Murasu
X

Cyclone Murasu

Cyclone Murasu: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా బలపడటంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. ఈ తుఫాన్‌కు మురసు (Murasu) అని పేరు పెట్టారు. నవంబర్ 1న ఉదయం 11.30 గంటల సమయంలో ఇది తుఫాన్‌గా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం గంటకు సుమారు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న మురసు.. సోమవారం నాటికి మరింత బలపడి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ తుఫాన్‌కు భారత్ పేరు పెట్టింది. మురసు అంటే యుద్ధ భేరి అని అర్థం.

నవంబర్ 3న తీరం దాటే అవకాశం

మురసు తుఫాన్ ప్రభావంతో ఏపీ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే ప్రమాదం ఉంది. నవంబర్ 3న నెల్లూరు నుంచి నరసాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని తాజా అంచనాలు చెబుతున్నాయి. అయితే తుఫాన్ కదలికలు, దిశలో మార్పులను బట్టి తీరం దాటే ప్రాంతం మారవచ్చు. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారే సూచనలు ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

చంద్రబాబు ఢిల్లీ పర్యటన రద్దు

తుఫాన్ ముప్పును దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతాలు, జలాశయాల్లోకి వచ్చే వరద నీరు, విద్యుత్ సరఫరాకు కలిగే అంతరాయాలపై వివరాలు తెలుసుకున్నారు. ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా తన ఢిల్లీ పర్యటనను కూడా రద్దు చేసుకుని రాష్ట్రంలో పరిస్థితుల పర్యవేక్షణపై దృష్టి పెట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఏపీ జిల్లాలకు భారీ వర్ష సూచన

నవంబర్ 2 నుంచి ఏపీలో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ, మధ్య కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని అంచనా. నవంబర్ 3న ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఏలూరులో సగటున 179 మిల్లీమీటర్లు, కృష్ణాలో 163, ఎన్టీఆర్ జిల్లాలో 161, పశ్చిమ గోదావరిలో 147, గుంటూరులో 119, బాపట్లలో 104 మిల్లీమీటర్ల వర్షం కురిసే సూచనలున్నాయి. అత్యంత భారీ వర్ష సూచన ఉన్న 20 మండలాల్లో ఏలూరు జిల్లాలోనే 9 మండలాలు ఉండటం గమనార్హం.

తెలంగాణలోనూ వర్షాలు

మురసు తుఫాన్ ప్రభావం తెలంగాణపైనా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నవంబర్ 2, 3 తేదీల్లో ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాంతాలతో పాటు నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లోనూ వర్షాలు పడవచ్చని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ వర్ష సూచన ఉంది. ప్రజలు వాతావరణ శాఖ హెచ్చరికలను గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలి. తుఫాన్ దిశ, తీవ్రతలో మార్పులను బట్టి తాజా హెచ్చరికలు మారే అవకాశం ఉన్నందున అధికారిక సమాచారాన్ని అనుసరించడం ముఖ్యం.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.