Cyclone Murasu: అర్నబ్ భయం తీరకముందే మరో దెబ్బ.. ఏపీకి పొంచి ఉన్న భారీ తుఫాన్ ముప్పు
అర్నబ్ తుఫాన్ భయం నుంచి తేరుకోకముందే ఏపీకి మరో తుఫాన్ ముప్పు ముంచుకొచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాన్ నవంబర్ 2, 3 తేదీల్లో భారీ వర్షాలు కురిపించే అవకాశం ఉంది.
Cyclone Murasu
Cyclone Murasu: అర్నబ్ తుఫాన్ సృష్టించిన భీభత్సం తాలూకు గుర్తులు ఇంకా కళ్ల ముందే మెదులుతుంటే, ఏపీ ప్రజలకు మరో పెద్ద గండం ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో పుట్టుకొచ్చిన అల్పపీడనం వేగంగా బలపడి రాబోయే కొద్ది గంటల్లోనే కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త విపత్తుకు మురసు అని పేరుపెట్టారు. సరిగ్గా పండుగ వేళ వాతావరణ శాఖ ఇచ్చిన ఈ హెచ్చరికలు రాష్ట్ర ప్రజలను గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తున్నాయి. నిన్నటి గాయాలు మానకముందే మరో తుఫాన్ దూసుకొస్తుండటంతో అన్నదాతలు, తీర ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక
వాయుగుండంగా మారిన ఈ మురసు ముప్పు నవంబర్ 2, 3 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారుల అంచనా ప్రకారం కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో దంచికొట్టే వానలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సముద్రం అల్లకల్లోలంగా మారుతున్నందున మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లవద్దని స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబు హైఅలర్ట్
మరో తుఫాన్ ముప్పు ముంచుకొస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే రంగంలోకి దిగారు. అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి ప్రతి ఆరు గంటలకు వాయుగుండం కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. అర్నబ్‌ను ఎదుర్కొన్న అనుభవంతో ఈసారీ మురసును సమర్థంగా తిప్పికొట్టి ప్రజలకు పూర్తి భరోసానివ్వాలని స్పష్టం చేశారు. మరోవైపు మంత్రి అచ్చెన్నాయుడు కూడా స్పందించి రైతులు కోతకొచ్చిన పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
అన్నదాతలకు కంటి మీద కునుకు కరువు
ఇటీవలి వర్షాలతో నష్టపోయిన రైతన్నలకు ఈ కొత్త తుఫాన్ వార్త శరాఘాతంలా తగిలింది. పొలాల్లో నీరు నిల్వకుండా తక్షణమే కాలువలను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అందుబాటులో ఉండి రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశాలు వెళ్లాయి. ఏదేమైనా ప్రకృతి మళ్లీ కన్నెర్రజేయడంతో ఏపీ ప్రజలు మరోసారి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.




