Mastan Rao: నెల్లూరు జిల్లా పురోగతికి దగదర్తి విమానాశ్రయం కీలకం ఎంపీ!

Mastan Rao: నెల్లూరు జిల్లా దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తోందని రాజ్యసభలో ఎంపీ బీద మస్తాన్ రావు ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 3 Aug 2026 11:08 PM IST
Mastan Rao
X

Mastan Rao: నెల్లూరు జిల్లా పురోగతికి దగదర్తి విమానాశ్రయం కీలకం ఎంపీ!

Mastan Rao: నెల్లూరు జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా ప్రతిపాదించిన దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి రాజ్యసభలో బీద మస్తాన్ రావు యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ సమాధానం ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2016లో దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి సూత్రప్రాయ (In-Principle) ఆమోదం మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. విమానాశ్రయం అభివృద్ధి కోసం తొలుత 2016లో పీపీపీ (PPP) విధానంలో టెండర్లు పిలవగా, 2018లో కుదిరిన కన్సెషన్ ఒప్పందం ఎంపికైన సంస్థ ఆర్థిక ముగింపు (Financial Closure) సాధించలేకపోవడంతో 2020లో రద్దు చేయబడిందని వివరించారు.

అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 2025 సెప్టెంబర్ 5, 2026 మార్చి 5, 2026 మే 29 తేదీల్లో మూడు దఫాలుగా పీపీపీ కన్సెషనర్ ఎంపిక కోసం టెండర్లు ఆహ్వానించినప్పటికీ, ఇప్పటివరకు ఏ బిడ్‌కు ఆమోదం లభించలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్స్ పాలసీ ప్రకారం విమానాశ్రయ నిర్మాణ బాధ్యత సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రాజెక్టు అభివృద్ధి సంస్థదేనని, భూసేకరణ, చట్టబద్ధ అనుమతులు, ఆర్థిక ముగింపు వంటి అంశాలపై ప్రాజెక్టు పురోగతి ఆధారపడి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా బీద మస్తాన్ రావు యాదవ్ మాట్లాడుతూ దగదర్తి విమానాశ్రయం నెల్లూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి కీలక మౌలిక సదుపాయంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా సముద్ర ఆహార (సీఫుడ్) ఎగుమతులు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, పారిశ్రామిక అభివృద్ధి, రామాయపట్నం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, దుగ్గరాజుపట్నం ప్రాంత అభివృద్ధికి ఈ విమానాశ్రయం ఎంతో దోహదపడుతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి నిర్మాణ పనులను ప్రారంభించేలా కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారాన్ని కొనసాగించాలని ఆయన కోరారు. దగదర్తి విమానాశ్రయం కార్యరూపం దాల్చడం ద్వారా నెల్లూరు జిల్లాతో పాటు మొత్తం దక్షిణ ఆంధ్రప్రదేశ్‌కు పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story