పులివెందులలో సంచలనం.. జగన్ ర్యాలీలో దస్తగిరి నినాదాలు.. ఉద్రిక్తత

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన సొంత గడ్డ పులివెందులలో ఊహించని షాక్ తగిలింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం, పోలింగ్

G Krishna
Published on: 1 Nov 2026 1:05 PM IST
jagan-dastagiri
X

jagan-dastagiri

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన సొంత గడ్డ పులివెందులలో ఊహించని షాక్ తగిలింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం, పోలింగ్ పరిశీలనలో భాగంగా ఆయన చేపట్టిన ర్యాలీలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి అకస్మాత్తుగా ఎదురుపడి తీవ్ర ఆరోపణలు చేయడంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.

ర్యాలీకి ఎదురొచ్చి సంచలన ఆరోపణలు

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొన్న వేళ జగన్ పులివెందుల పురవీధుల్లో ర్యాలీగా బయలుదేరారు. కాన్వాయ్ ముందుకు సాగుతున్న సమయంలో దస్తగిరి అకస్మాత్తుగా ర్యాలీకి ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు. వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు 'దస్తగిరి వస్తున్నాడు' అని జగన్‌ను హెచ్చరించే లోపే, అతడు కాన్వాయ్ సమీపానికి చేరుకుని గట్టిగా అరుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. "సొంత బాబాయ్ వివేకాను చంపించి మా జీవితాలను నాశనం చేశావ్" అంటూ దస్తగిరి నినాదాలు చేయడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

అడ్డుకున్న పోలీసులు.. జగన్ సమాధానం లేకుండా ముందుకు

దస్తగిరి జగన్ వాహనం వైపు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని పక్కకు లాగేశారు. ఈ అనూహ్య పరిణామంతో జగన్ కాసేపు నిశ్చేష్టులైనప్పటికీ, అనంతరం దస్తగిరి వైపు పట్టించుకోనట్లుగా చూస్తూ తన కాన్వాయ్‌తో ముందుకు సాగిపోయారు. పులివెందుల నడిరోడ్డుపై జగన్ సమక్షంలోనే ఈ ఘటన జరగడంతో స్థానికంగా , వైఎస్సార్ జిల్లా రాజకీయాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.