Weather Update : మబ్బులు ఉన్నాయి కానీ చుక్క వాన పడడం లేదు.. భారీ ట్విస్ట్ ఇచ్చిన తీవ్ర వాయుగుండం
Weather Update : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం దిశ మార్చుకోవడంతో ఏపీలో ఆశించిన వర్షాలు పడలేదు. వర్షపాతం లోటు 54 శాతానికి చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Weather Update
Weather Update : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉమ్మడి రాష్ట్రంలోని రైతాంగానికి తీవ్ర నిరాశ మిగిల్చింది. మొదట పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిపిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ, విచిత్రంగా ఇది తన దిశను మార్చుకుంది. ఉత్తరంగా పయనిస్తూ ఒడిశాలోని బాలాసోర్‌కు తూర్పున 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై, పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా, దిగల సమీపంలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో సోమవారం కోస్తాంధ్రలో కేవలం చెదురుమదురు వర్షాలు మాత్రమే కురిశాయి. వాయుగుండం ఒడిశా, బెంగాల్ వైపు వెళ్లిపోవడంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం తగ్గిపోయింది.
రాష్ట్రంలో 54 శాతం వర్షపాతం లోటు
తీవ్ర వాయుగుండం వచ్చినా రాష్ట్రంలో వర్షాలు కురవకపోవడంతో ఈ సీజన్‌లో వర్షపాతం లోటు ఏకంగా 54 శాతానికి చేరుకుంది. దీంతో రాష్ట్రంలో కరువు ఛాయలు అలముకుంటున్నాయని వ్యవసాయ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎల్‌నినో ప్రభావం ఉన్న సంవత్సరాల్లో నైరుతి రుతుపవనాలు బలహీనపడతాయని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అరేబియా సముద్రం నుంచి వీచే గాలులు బలంగా ఉండకపోవడం వల్ల అవి పశ్చిమ కనుమల వరకే పరిమితమై పొడిగా మారుతున్నాయి. ఈ సీజన్‌లో తెలంగాణ, ఏపీ, తమిళనాడు ప్రాంతాలు వర్షాభావ ప్రాంతాలుగా మారాయి. ఆకాశంలో చాలాచోట్ల మేఘాలు కనిపిస్తున్నప్పటికీ, వాటిలో నీటిసాంద్రత బలంగా లేకపోవడంతో వర్షాలు కురవడం లేదు. ఇది ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.
ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు
తీవ్ర వాయుగుండం కారణంగా సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారడంతో అధికారులు ముందస్తు అప్రమత్తత చర్యలు చేపట్టారు. కోస్తాంధ్రలోని కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్న ఓడరేవుల్లో 3వ నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేసారు. మిగిలిన ఓడరేవుల్లో 1వ నంబరు హెచ్చరికలు అమల్లో ఉన్నాయి. సముద్రంలో పరిస్థితులు అనుకూలంగా లేనందున బుధవారం వరకు మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు హెచ్చరించారు.
నేడు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు
విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. తీవ్ర వాయుగుండం ప్రభావంతో మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, బాపట్ల, తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాల్లో చినుకులు పడవచ్చు. ఇక సోమవారం నమోదైన వర్షపాతాన్ని పరిశీలిస్తే.. అత్యధికంగా ఏలూరులో 67.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. అమలాపురంలో 35.2 మి.మీ., భీమవరంలో 30 మి.మీ., ప్రకాశం బ్యారేజీ వద్ద 30 మి.మీ., వేలూరుపాడులో 28 మి.మీ., పాలకోడేరులో 27 మి.మీ. చొప్పున వర్షం కురిసింది. దక్షిణ కోస్తాలో మాత్రం భానుడి భగభగలు కొనసాగాయి. కావలిలో అత్యధికంగా 38.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.




