Pawan Kalyan: పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్: 'నదులను చంపొద్దు.. ఆరు నెలల్లో నాకు రిజల్ట్ కనిపించాలి'!

Pawan Kalyan: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారుల సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 25 May 2026 11:28 AM IST
Pawan Kalyan
X

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్: 'నదులను చంపొద్దు.. ఆరు నెలల్లో నాకు రిజల్ట్ కనిపించాలి'!

Pawan Kalyan: తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ పరిరక్షణ, నదుల సంరక్షణపై తనకున్న నిబద్ధతను చాటుతూ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు. "మనకు జీవనాన్ని, జీవితాన్ని ఇచ్చే నదులను ఎట్టి పరిస్థితుల్లోనూ చంపవద్దు" అని ఆయన అధికారులకు హితవు పలికారు.

రాష్ట్రానికి జీవనాడులైన గోదావరి, కృష్ణా నదుల కాలుష్యం, వాటి పరిరక్షణపై పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. పారిశ్రామిక వ్యర్థాలు, ఇతర కాలుష్య కారకాల వల్ల నదులు పాడవుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మన సంస్కృతికి, మనుగడకు ఆధారమైన గోదావరి, కృష్ణా నదులను కంటికి రెప్పలా రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

నదుల ప్రక్షాళన, కాలుష్య నియంత్రణపై కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. రాబోయే 6 నెలల కాలంలో నదుల స్వచ్ఛతలో స్పష్టమైన, కంటికి కనిపించే మార్పు రావాలని అధికారులకు పవన్ కల్యాణ్ కఠినమైన డెడ్‌లైన్ విధించారు.

రాజమహేంద్రవరంలో అధికారులతో సుదీర్ఘ సమీక్ష ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ తన పర్యటనను కొనసాగించనున్నారు. రోడ్డు మార్గాన చారిత్రాత్మక ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ మీదుగా ఆయన ప్రయాణించనున్నారు. అక్కడ నుంచి పక్కనే ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని విజ్జేశ్వరానికి డిప్యూటీ సీఎం చేరుకోనున్నారు. పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story