Devarapalli: వామపక్షాల నిరసన హోరు: పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు తగ్గించాల్సిందే!
Devarapalli: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్‌లో పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
Devarapalli: వామపక్షాల నిరసన హోరు: పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు తగ్గించాల్సిందే!
Devarapalli: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్‌లో పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఈ ఆందోళన చేపట్టినట్లు నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ.67 ఉండేదని, ప్రస్తుతం రూ.100కు పైగా చేరుకుని సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపుతోందని విమర్శించారు. అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధాలను కారణాలుగా చూపుతూ ఇంధన ధరలను పెంచుతున్నారని ఆరోపించారు. ఆయిల్ కంపెనీలు తక్కువ ధరలకు సరఫరా చేస్తున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు, ఇతర చార్జీల కారణంగా వినియోగదారులపై అదనపు భారం పడుతోందని పేర్కొన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు అధికమై, దాని ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడుతోందన్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఇంధన ధరలను తగ్గించి, నిత్యావసర వస్తువుల ధరలను అదుపులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు రత్నాజీ, సత్యనారాయణ, రామారావు, అయినపర్తి శ్రీనివాస్, న్యూ డెమోక్రసీ నాయకులు పి. నాగేశ్వరరావు, నూకరాజు, సత్తిబాబు, శ్రీను, ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌కే మస్తాన్, జిల్లా అధ్యక్షుడు అక్కబత్తుల శ్రీనివాస్, అక్కబత్తుల రాజు, మల్లెపూడి రాంబాబు, విజయ్, కార్తీక్, సీపీఐ నాయకుడు ఆచంట సత్యనారాయణతో పాటు వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




