Razole: రాజోలు నియోజకవర్గంలో రెండు మద్యం షాపుల లైసెన్సులకు నోటిఫికేషన్!

Razole: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో రెండు మద్యం షాపుల లైసెన్సుల మంజూరుకు నోటిఫికేషన్ విడుదల.. అక్టోబర్ 1 వరకు దరఖాస్తులకు గడువు, అక్టోబర్ 5న లాటరీ.

PRABHU, RAZOLE
Published on: 25 Sept 2026 1:40 PM IST
Razole
X

Razole: రాజోలు నియోజకవర్గంలో రెండు మద్యం షాపుల లైసెన్సులకు నోటిఫికేషన్!

Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2026–27 సంవత్సరానికి రెన్యూవల్ అనంతరం మిగిలిన మద్యం దుకాణాలకు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL), ఫారిన్ లిక్కర్ షాపుల లైసెన్సుల మంజూరుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు రాజోలు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జి. మురళీ మోహన్ రావు తెలిపారు. ఇందులో భాగంగా రాజోలు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రెండు మద్యం దుకాణాలకు లైసెన్సుల మంజూరుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాజోలు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జి. మురళీ మోహన్ రావు మాట్లాడుతూ.. రాజోలు మండలంలోని కూనవరం, పొన్నమండ గ్రామాల్లో ఉన్న రెండు మద్యం దుకాణాలకు (GSL No. KSM/81, GSL No. KSM/88) 2026–27 సంవత్సరానికి నిర్వహణ లైసెన్సుల మంజూరుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు.

ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లేదా హైబ్రిడ్ విధానంలో సమర్పించవచ్చని, ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల చొప్పున రుసుము చెల్లించి లాటరీ ప్రక్రియలో పాల్గొనవచ్చని వివరించారు. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 1వ తేదీని చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు.

ప్రతి మద్యం దుకాణానికి కనీసం నాలుగు దరఖాస్తులు రావాల్సి ఉంటుందని, నాలుగు లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన దుకాణాలకు మాత్రమే లాటరీ నిర్వహించబడుతుందని ఇన్స్పెక్టర్ వెల్లడించారు. లైసెన్సుదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా అక్టోబర్ 5వ తేదీ ఉదయం 8 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నా, ఇతర వివరాలు తెలుసుకోవాలన్నా రాజోలు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ కార్యాలయాన్ని సంప్రదించాలని జి. మురళీ మోహన్ రావు సూచించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE