Yerragondapalem: పెద్ద దోర్నాలలో జేసీబీతో మంచినీటి పైపుల ధ్వంసం!

Yerragondapalem: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాలకు నీటిని సరఫరా చేసే పైపులైన్లను జేసీబీతో ధ్వంసం చేశారు. దీంతో స్థానికులకు మంచినీటి కష్టాలు తప్పలేదు.

Srikanth Singam, Markapur
Published on: 28 Sept 2026 10:51 AM IST
Yerragondapalem
X

Yerragondapalem: పెద్ద దోర్నాలలో జేసీబీతో మంచినీటి పైపుల ధ్వంసం!

Yerragondapalem: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం ఎడవల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఘటనతో పెద్ద దోర్నాల ప్రజలకు మంచినీటి కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. పెద్ద దోర్నాలకు నీటిని సరఫరా చేసే మంచినీటి పైపులైన్లను గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీతో ధ్వంసం చేశారు

ఎడవల్లి గ్రామం నుంచి పెద్ద దోర్నాలకు నీటి సరఫరా జరుగుతున్న సమయంలో కొందరు వ్యక్తులు విద్యుత్ మోటారు కనెక్షన్లను మార్చి తమ సొంత అవసరాలకు గ్రామపంచాయతీ నీటిని వినియోగిస్తున్నట్లు పంచాయతీ నీటి సరఫరా సిబ్బంది గుర్తించారు. దీంతో సిబ్బంది మోటారు కనెక్షన్లను సరిచేసి పెద్ద దోర్నాలకు నీటి సరఫరాను పునరుద్ధరించారు. దీంతో కొంతకాలంగా నెలకొన్న నీటి సమస్యకు కొంత ఉపశమనం లభించింది.

అయితే అక్రమ నీటి కనెక్షన్లను అరికట్టడంలో గ్రామపంచాయతీ అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలుమార్లు గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లుకు తెలియజేసినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో అక్రమంగా నీటిని వినియోగిస్తున్న వ్యక్తుల కనెక్షన్లు తొలగించడంతో ఆగ్రహించిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గత రాత్రి జేసీబీతో పెద్ద దోర్నాల వైపు వచ్చే మంచినీటి పైపులైన్లను ధ్వంసం చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో పెద్ద దోర్నాలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కార్యదర్శి బాధ్యత ఏమిటి?

గ్రామ ప్రజలకు ప్రాథమిక అవసరమైన మంచినీటి సరఫరా వ్యవస్థను పరిరక్షించాల్సిన బాధ్యత పంచాయతీ అధికారులపై ఉంది. అలాంటి నీటి పైపులైన్లను జేసీబీతో ధ్వంసం చేసిన ఘటనపై అధికారులు వెంటనే స్పందించి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ముఖ్యంగా ఈ వ్యవహారంపై పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలోనే అక్రమ నీటి కనెక్షన్ల విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించకపోవడం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చిందా? అన్న ప్రశ్నలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

పైపుల ధ్వంసం ఘటనపై తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా కార్యదర్శి మౌనం వహించడం పట్ల కూడా ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు నీళ్లు అందించాల్సిన బాధ్యత ఎవరిది? పైపులు ధ్వంసం చేస్తే వాటిని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? అనే ప్రశ్నలకు పంచాయతీ అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి మంచినీటి పైపుల ధ్వంసంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను గుర్తించడంతో పాటు, పెద్ద దోర్నాలకు నిరంతరాయంగా మంచినీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur