IMD Alert : దేశంలోని 197 జిల్లాల్లో కరువు ముంచుకొస్తుంది.. రైతన్నలకు కేంద్రం హెచ్చరిక
IMD Alert : పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు ప్రారంభమయ్యాయని ఐఎండీ ప్రకటించింది. దీనివల్ల ఏపీ సహా దేశంలోని 197 జిల్లాల్లో వర్షాభావం ఏర్పడి, ఖరీఫ్ పంటల దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది.
ElNino Alert
IMD Alert : మనదేశంలో వ్యవసాయం పూర్తిగా రుతుపవనాలపైనే ఆధారపడి ఉంటుంది. అలాంటిది ఈ ఏడాది రైతన్నలను కలవరపెట్టే ఒక చేదు వార్తను భారత వాతావరణ శాఖ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. భూమధ్యరేఖకు ఆనుకుని ఉండే పసిఫిక్ మహాసముద్రంపై ఎల్‌నినో పరిస్థితులు ఉద్భవించాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ సముద్ర ప్రాంతంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. దీని ప్రభావంతో భూమధ్యరేఖ పరిసరాల్లోని తూర్పు, మధ్య పసిఫిక్ మహాసముద్ర వాతావరణంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
జూలై నుంచి మరింత పెరగనున్న ముప్పు
ప్రస్తుతం దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ నడుస్తోంది. అయితే ఈ సీజన్ గడుస్తున్న కొద్దీ ఎల్‌నినో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వచ్చే జూలై నెల నుంచి తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోకి వేడి వాతావరణం వేగంగా విస్తరించనుంది. ఈ క్రమంలో ఎల్‌నినో తీవ్రరూపం దాల్చితే.. అది భారత రుతుపవనాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. సముద్రపు వేడి గాలుల వల్ల మన దేశానికి రావాల్సిన వర్ష పాతం క్రమంగా తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది.
దేశంలోని 197 జిల్లాలపై తీవ్ర ప్రభావం
ఈ ఎల్‌నినో ప్రభావం కేవలం వాతావరణానికే పరిమితం కాకుండా నేరుగా మన కడుపు కొట్టేలా ఉంది. దేశంలోని సుమారు 197 జిల్లాలపై ఎల్‌నినో ప్రభావం చాలా ఘోరంగా ఉండబోతోందని కేంద్ర వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఈసారి వర్షాభావ పరిస్థితులు (కరువు ఛాయలు) నెలకొనే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. తగినంత వర్షాలు పడకపోతే ఆయా ప్రాంతాల్లో సాగు నీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవు.
పప్పుధాన్యాలు, సోయాబీన్ సాగుకు పెద్ద దెబ్బ
వర్షాలు సకాలంలో పడకపోవడం వల్ల ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో వేసే పంటల దిగుబడి భారీగా పడిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మన రోజువారీ ఆహారంలో వాడే పప్పుధాన్యాలు, నూనె గింజలైన సోయాబీన్ ఉత్పత్తి ఈసారి ఊహించని రేంజ్ లో తగ్గిపోవచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. పంటల ఉత్పత్తి తగ్గితే మార్కెట్లో డిమాండ్ పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. ఇది అటు రైతులకు, ఇటు సామాన్య వినియోగదారులకు ఇద్దరికీ పెద్ద తలనొప్పిగా మారనుంది.
మరోవైపు ఊరటనిస్తున్న రుతుపవనాల విస్తరణ
ఎల్‌నినో భయపెడుతున్నప్పటికీ, ప్రస్తుతానికి ఒక చిన్న ఊరటనిచ్చే వార్తను కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం నాటికి నైరుతి రుతుపవనాలు దేశంలోని పలు రాష్ట్రాలకు విజయవంతంగా విస్తరించాయి. రానున్న రెండు మూడు రోజుల్లో ఇవి మరింత ముందుకు కదిలి.. దక్షిణాదిలోని అన్ని ప్రాంతాలతో పాటు మధ్య, తూర్పు భారతంలోని పలు రాష్ట్రాలకు విస్తరించనున్నాయని అధికారులు తెలిపారు. రుతుపవనాలు సకాలంలో వస్తున్నప్పటికీ, జూలై తర్వాత ఎల్‌నినో వీటిని ఎంతవరకు అడ్డుకుంటుందో అనేదే ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న పెద్ద ప్రశ్న.




