Eluru: దుప్పటి అడిగినందుకు దారుణం.. రాత్రి 10 గంటలకు విద్యార్థినిని హాస్టల్ నుంచి గెంటేసిన వార్డెన్!
Eluru: ఏలూరు జిల్లా చింతలపూడిలోని ప్రభుత్వ సమీకృత వసతిగృహంలో దారుణ ఘటన వెలుగుచూసింది.
Eluru: దుప్పటి అడిగినందుకు దారుణం.. రాత్రి 10 గంటలకు విద్యార్థినిని హాస్టల్ నుంచి గెంటేసిన వార్డెన్!
Eluru: ప్రభుత్వ వసతిగృహాల్లో విద్యార్థినులకు రక్షణ కల్పించాల్సిన స్థానంలో ఉన్న ఓ వార్డెన్ అమానుషంగా ప్రవర్తించారు. కనీసం మానవత్వం కూడా లేకుండా చలి తట్టుకోలేక దుప్పటి అడిగినందుకు ఓ ఎనిమిదో తరగతి విద్యార్థినిని రాత్రి 10 గంటల సమయంలో వసతిగృహం (Hostel) నుంచి బయటికి పంపేసిన ఘటన ఏలూరు జిల్లా చింతలపూడిలో ఆలస్యంగా వెలుగుచూసింది.
బాధిత బాలిక కుటుంబీకులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందిన ఒక బాలిక ఇక్కడి సమీకృత ప్రభుత్వ వసతిగృహంలో ఉంటూ, స్థానిక బాలికల జడ్పీ (ZP) ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. శనివారం రాత్రి పడుకునే ముందు వసతిగృహంలో చలిగా ఉండటంతో తనకు దుప్పటి ఇవ్వలేదని వార్డెన్ స్వప్నకు సదరు బాలిక విన్నవించుకుంది.
చిన్నారి అడిగిన ప్రశ్నకు వార్డెన్ స్వప్న తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అంతటితో ఆగకుండా హాస్టల్ సిబ్బందితో బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేయించారు. "మీ అమ్మాయికి హాస్టల్‌లో సీటు లేదు.. వెంటనే వచ్చి మీ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లండి" అని గద్దించారు.
ఫోన్ రాగానే ఆందోళనకు గురైన బాలిక తల్లిదండ్రులు రాత్రి పూట అని కూడా చూడకుండా వెంటనే వసతిగృహానికి చేరుకున్నారు. అసలేం జరిగిందోనని వార్డెన్‌ను ఆరా తీశారు. రాత్రి వేళ కావడం వల్ల తమ బిడ్డను వసతిగృహంలోనే ఉండేలా చూడాలని, ఉదయం మాట్లాడుకుందామని కాళ్లు పట్టుకునంత పని చేస్తూ వేడుకున్నారు. అయినా సరే వార్డెన్ ఏమాత్రం కనికరించకుండా బాలికను రాత్రి 10 గంటల సమయంలోనే తల్లిదండ్రులతో పాటు బయటకు పంపించేశారు.
"మా అమ్మాయి మూడేళ్లుగా ఇదే వసతిగృహంలో ఉంటూ చదువుకుంటోంది. గత ఫిబ్రవరిలో అనుకోకుండా చెయ్యి విరగడంతో ఇంటికి తీసుకెళ్లాం. ఇప్పుడిప్పుడే కోలుకోవడంతో చదువు పాడవ్వకూడదని ఇటీవల ఇక్కడ వదిలి వెళ్లాను. అంతలోనే ఇంత ఘోరానికి ఒడిగట్టారు అని బాలిక తండ్రి తెలిపారు.
ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఈ విషయంపై అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ASWO) శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఒక విద్యార్థినిని రాత్రిపూట అంతటి అనాలోచితంగా ఇంటికి పంపడం తీవ్రమైన తప్పిదమని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యురాలైన వార్డెన్ స్వప్నపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ప్రజాసంఘాలు, దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధ్యత లేని వార్డెన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.




