Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. అనుమతి లేని దీక్షపై పోలీసుల కేసు నమోదు!

Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరులో మరో కేసు నమోదు. అనుమతి లేకుండా కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేసినందుకు నగరంపాలెం పోలీసులు కేసు ఫైల్ చేశారు.

Arun Chilukuri
Published on: 21 April 2026 10:54 AM IST
Ambati Rambabu
X

Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. అనుమతి లేని దీక్షపై పోలీసుల కేసు నమోదు!

Ambati Rambabu: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే వరుస కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయనపై తాజాగా గుంటూరులో మరో కేసు నమోదైంది. కలెక్టరేట్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా నిరాహార దీక్ష చేపట్టారన్న ఆరోపణలపై నగరంపాలెం పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

ఇటీవల తన ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా, బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షకు దిగారు. అయితే, ఈ దీక్షకు ముందస్తు పోలీసు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశంలో అనుమతి లేకుండా ఆందోళన నిర్వహించడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని, ప్రజలకు తీవ్ర అంతరాయం కలిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆయనపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.

సత్తెనపల్లి లక్కీడ్రా కేసుతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుల్లో అంబటి రాంబాబు ఇప్పటికే 17 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్నారు. ఇటీవలే బెయిల్‌పై విడుదలైన ఆయనకు, ఈ కొత్త కేసు మరో తలనొప్పిగా మారింది. ఈ తాజా పరిణామంపై అంబటి రాంబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story