Vijayasai Reddy: ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. సీఎం రేసులో లేనన్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి

Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు.

Arun Chilukuri
Published on: 7 Sept 2026 1:58 PM IST
Vijayasai Reddy
X

Vijayasai Reddy: ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. సీఎం రేసులో లేనన్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి

Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతున్నట్లు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ప్రకటించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కొత్త పార్టీ జెండా, అజెండాకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ, జనసేన ప్రధాన పార్టీలుగా ఉన్నప్పటికీ.. ఇతర పార్టీలు ప్రజా సమస్యలపై పూర్తిగా దృష్టి సారించలేకపోతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే ప్రజల కోసం మరో రాజకీయ పార్టీ అవసరం ఎంతైనా ఏర్పడిందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ప్రధాన పార్టీలపై విజయసాయి రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. టీడీపీని 'రెడ్ బుక్ పార్టీ'గా, వైసీపీని 'రప్ప రప్ప పార్టీ'గా అభివర్ణించారు. అధికారపక్షం వైపే పోలీసులు ఉండి పనిచేస్తున్నారని, ప్రజల సొమ్మును దోచుకునేందుకే రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా కేవలం కుటుంబ పార్టీలుగానే మారామని విమర్శించారు. రాష్ట్రంలో రౌడీ మామూలు లేనిదే ఏ పని జరగడం లేదని, ప్రతి ఒక్కరికీ కప్పం కడితేనే పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం తమిళనాడు తరహా రాజకీయాలు ఏపీలో కనిపిస్తున్నాయని, ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేయడానికే ప్రభుత్వాలు ప్రధాన్యత ఇస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీల అజెండా ప్రజల సంక్షేమం కాకుండా కేవలం డబ్బు సంపాదనకే పరిమితమైందని ధ్వజమెత్తారు.

కొత్త పార్టీ విధానాలు, భవిష్యత్ ప్రణాళికలపై విజయసాయి రెడ్డి స్పష్టతనిచ్చారు. తాను కొత్త రాజకీయ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్ధిని కానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేవలం రెడ్డి, కమ్మ కులాలకేనా అధికారం దక్కేది? ఇతర కులాల్లో అర్హులు లేదా? అని ప్రశ్నించారు. అర్హులైన వారికే పెద్దపీట వేస్తామని, తాను వెనుక ఉండి సలహాలు ఇస్తానే తప్ప నేరుగా ఎలాంటి పదవి చేపట్టనని తేల్చిచెప్పారు. దేశభక్తి ఉన్నవారికే కొత్త పార్టీలో పెద్దపీట వేస్తామన్నారు. రాష్ట్రంలో పార్టీ విధానాలను వివరించేందుకు అనంతపురం, తిరుపతి, విశాఖపట్నంలో మరో మూడు మీడియా సమావేశాలు నిర్వహిస్తామని, ఒక్కో సమావేశంలో ఐదు కీలక అంశాలను ప్రకటిస్తామని తెలిపారు. ఆ అంశాలన్నింటినీ కలిపి ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరుస్తామని చెప్పారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఏపీలో ఆదాయం కంటే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని, నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయని తెలిపారు. ఆ ధరలను ఎలా తగ్గించాలనే దానిపై తమ పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెడుతుందని పేర్కొన్నారు. ఎంత ఇష్టం ఉన్నా లేకున్నా అమరావతిని రాజధానిగా గుర్తించి తీరాల్సిందేనని, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. 'జెన్ జీ' (Gen Z) అంటే ప్రభుత్వాలు ఎందుకు భయపడుతున్నాయని ప్రశ్నించారు.

యువతకు పెద్దపీట వేస్తూ కీలక హామీలు గుప్పించారు. 25 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల వారికే 66 శాతం ప్రభుత్వ పదవులు కేటాయిస్తామని వెల్లడించారు. అలాగే ఎవరిపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఉచిత విద్యుత్ అందించే అవకాశం ఉందని, ప్రజలే తిరిగి ప్రభుత్వానికి విద్యుత్ అమ్మే సరికొత్త పరిస్థితిని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల ధరలు తగ్గాలని, రాష్ట్రంలో నీటి పారుదల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి సరిదిద్దుతామని విజయసాయి రెడ్డి ప్రకటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story