టీడీపీకి షాక్: వైసీపీలోకి శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి!
Gunda Lakshmi Devi: శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వైఎస్సార్‌సీపీలో చేరారు.
టీడీపీకి షాక్: వైసీపీలోకి శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి!
Gunda Lakshmi Devi: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ఆవిర్భావం నుంచి దాదాపు 40 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పసుపు కండువా వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) తీర్థం పుచ్చుకున్నారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో లక్ష్మీదేవి, ఆమె అనుచరులు భారీ సంఖ్యలో వైసీపీలో చేరారు. వారికి జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
వైసీపీలో చేరిన అనంతరం గుండ లక్ష్మీదేవి విలేకరులతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పిలుపు మేరకు తమ కుటుంబం 40 ఏళ్లుగా నిబద్ధతతో టీడీపీకి సేవలందించిందని, కానీ చివరకు తమకు తీవ్ర అవమానాలే మిగిలాయని వాపోయారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన తన భర్త, దివంగత నేత గుండ అప్పల సూర్యనారాయణ అనారోగ్యంతో ఉన్న సమయంలో కనీసం పరామర్శించేందుకు కూడా అధినేత చంద్రబాబు రాలేదని భావోద్వేగానికి గురయ్యారు.
శ్రీకాకుళంలో తన భర్త విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తే, స్థానిక టీడీపీ నేతలు అడ్డుకోవడమే కాకుండా విగ్రహం కోసం నిర్మించిన దిమ్మెలను ధ్వంసం చేశారని లక్ష్మీదేవి సంచలన ఆరోపణలు చేశారు. ఈ తీవ్ర అవమానాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందనా లేకపోవడంతోనే బాధతో పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు. 2024 ఎన్నికల్లో టికెట్ నిరాకరించినా పార్టీకి కట్టుబడి ఉన్నామని, అయినప్పటికీ తమను నిరంతరం దూరం పెట్టారని ఆరోపించారు.
ఇటీవల శ్రీకాకుళం మేయర్ పదవిని ఆశించినప్పటికీ, పొత్తులో భాగంగా ఆ సీటును జనసేనకు కేటాయించడంతో పరిణామాలు వేగంగా మారాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తదితర వైసీపీ నేతలు ఆమెతో జరిపిన చర్చలు ఫలించాయి. కూటమి పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారని, జగన్ నాయకత్వంలో ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతోనే వైసీపీలో చేరానని లక్ష్మీదేవి స్పష్టం చేశారు.




