Srikakulam: రాజాంలో గంజాయి బ్యాచ్ బీభత్సం.. కుటుంబంపై బ్లేడ్లతో దాడి!

Srikakulam: రాజాం శ్రీనివాస కాలనీలో గంజాయి మత్తులో యువకుల వీరంగం. బ్లేడ్లతో కుటుంబంపై దాడి చేసిన దుండగులు. తరచూ కాలనీలో భయాందోళన సృష్టిస్తున్న నిందితుడు మురళి.

SRIDHAR, RAJAM
Published on: 18 April 2026 11:40 AM IST
Srikakulam
X

Srikakulam: రాజాంలో గంజాయి బ్యాచ్ బీభత్సం.. కుటుంబంపై బ్లేడ్లతో దాడి!

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా: రాజాంలో గంజాయి మత్తులో కొందరు వ్యక్తులు హంగామా సృష్టించి, కుటుంబంపై దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాజాం పట్టణంలోని శ్రీనివాస కాలనీలో శుక్రవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గంజాయి మత్తులో ఉన్న నలుగురు వ్యక్తులు వీధిలో తూగుతూ వెళ్లుతూ ఓ మహిళపై పడిపోవడానికి ప్రయత్నించారు. దీన్ని గమనించిన మహిళ తండ్రి వారిని అడ్డుకోవడంతో, ఆగ్రహించిన వారు ఆయనపై దాడికి దిగారు. వెంటనే మహిళ తన అన్నకు సమాచారం ఇవ్వగా, అతను వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి, తన తండ్రి, చెల్లిని ఇంటి మేడపైకి తీసుకెళ్లాడు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన సమయంలో, ఒంటరిగా ఉన్న బాధితులపై మళ్లీ దాడికి పాల్పడ్డారు. బ్లేడ్లతో విచక్షణారహితంగా గాయపరిచి, హత్యాయత్నానికి కూడా ప్రయత్నించినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి వారిని అడ్డుకోవడంతో పరిస్థితి మరింత విషమం కావడం తప్పింది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి మురళిగా స్థానికులు గుర్తించారు. అతను తరచూ వీధిలో భయాందోళన సృష్టిస్తూ, రాత్రిళ్లు తలుపులు గుద్దడం, గేట్లు కొట్టడం, గ్యాస్ సిలిండర్లు రోడ్డుపై పడవేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నాడని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనతో శ్రీనివాస కాలనీలో భయాందోళన నెలకొంది. వెంటనే చర్యలు తీసుకుని కాలనీ ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.

SRIDHAR, RAJAM

SRIDHAR, RAJAM

Next Story