Gollapalli Amulya: జూన్ 1 నుండి విశాఖ రైల్వే జోన్ ప్రారంభం.. గెజిట్ విడుదలపై గొల్లపల్లి అమూల్య హర్షం
Gollapalli Amulya: విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర గెజిట్ విడుదల కావడం కూటమి ప్రభుత్వ విజయమని గొల్లపల్లి అమూల్య అన్నారు.
మామిడికుదురు: విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న దక్షిణ కొస్తా రైల్వే జోన్ కు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం శుభ పరిణామమని, కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, రాజోలు ఇంచార్జ్ గొల్లపల్లి అమూల్య అన్నారు. గురువారం మామిడికుదురు మండలం మామిడికుదురులో మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడనున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు జూన్1 నుండి ప్రారంభమవుతాయని, దీంతో నాలుగు దశాబ్దాల ఈ ప్రాంత ప్రజల కల సాకారం అవుతుందన్నారు. గత వైసిపి ప్రభుత్వం ఐదేళ్లలో చేసింది ఏమీ లేదని..కనీసం భూ సేకరణ కూడా నిర్వహించకుండా నిర్లక్ష్యం చేశారని అమూల్య విమర్శించారు. వైసిపి పాలనలో ఏ ఒక్క రైల్వే ప్రాజెక్టును మంజూరు చేయించలేని జగన్ సైకో ముఠా నేడు చంద్రబాబు కృషి ఫలితంగా వచ్చిన విశాఖ రైల్వే జోన్ పై ఆదాయం వచ్చే లైన్లు ఇవ్వలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తూ..ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అమూల్య అన్నారు.
విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వంటి ప్రధాన పోర్టులన్నీ నూతన రైల్వే జోన్ లోకి రావడం ద్వారా అధిక ఆదాయం వస్తుందని ఆమె వివరించారు. కోల్, స్టీల్, ఫెర్టిలైజర్ రవాణాలో విశాఖ జోన్ కింగ్ మేకర్ కాబోతుందని, ఇది తెలియకుండా వైసిపి నాయకులు ఆదాయం లేదు అంటూ విమర్శించడం వారి అజ్ఞానానికి నిదర్శనమని అమూల్య అన్నారు. ఐదేళ్ల అధికారంలో ఉండి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రైల్వే జోన్ సాధించలేని వైసీపీ వాళ్లు చంద్రబాబుని విమర్శించడం వాళ్ళ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. నేడు భారత ప్రధాని మోడీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ లు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని అమూల్య పేర్కొన్నారు.




